నాడి పట్టేదెవరు? సర్కారు దవాఖానాల్లో  డాక్టర్ల కొరత

నాడి పట్టేదెవరు? సర్కారు దవాఖానాల్లో  డాక్టర్ల కొరత
  • రోగమొస్తే చూసేందుకు ఎవరూ లేరు
  • ప్రాణాలు పోయినాఅడిగే దిక్కు లేదు
  • వనపర్తి జిల్లాలో శిథిలావస్థకు చేరిన పీహెచ్​సీలు
  • పేదలకు తప్పని తిప్పలు

వనపర్తి / పెబ్బేరు, వెలుగు : పేరుకు ఆస్పత్రులు పెద్దగా ఉన్నా..  వనపర్తి జిల్లాలో రెగ్యులర్ డాక్టర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్​ నర్సులు, ఫార్మాసిస్టులు కొద్ది మందే ఉండటంతో వీలైనంత ఎక్కువ మందికి వైద్య సేవలు అందించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల డాక్లర్లు ఉన్నా వారు మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు ముగించుకొని వెళ్తున్నారు. ఆ తర్వాత స్టాఫ్​ నర్సులే డ్యూటీలో ఉండి డెలివరీలు చేయడంతో కొన్ని సక్సెస్​ అవుతున్నాయి. మరికొన్ని కేసుల్లో పుట్టిన పిల్లో లేదంటే తల్లి చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. 

డాక్టర్ల కోసం ఎదురుచూపులు

ఇటీవల పెబ్బేరు పీహెచ్​సీలో కాంటింజెన్సీ వర్కర్ నార్మల్​డెలివరీకి ప్రయత్నించగా, గర్భిణి ఎంతకీ నొప్పులు తీయడం లేదని వనపర్తి ఎంసీహెచ్​కు​ రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లే లోపే పురిట్లోనే మగ శిశువు చనిపోవడంతో.. డాక్టర్​తోపాటు స్టాఫ్​ నర్సు, కాంటింజెన్సీ వర్కర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. దీంతో పెబ్బేరు పీహెచ్​సీలో ఇప్పుడు పల్లె దవాఖానాల్లో పని చేసే డాక్లర్లే దిక్కయ్యారు. వారు అక్కడ, ఇక్కడ రెండు చోట్లా డ్యూటీ చేయాల్సి వస్తోంది. సమయానికి డాక్టర్లు రాక ప్రజలు ఆస్పత్రి వద్ద ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.

శిథిలావస్థకు చేరిన భవనాలు

వనపర్తి జిల్లాలో  మొత్తం 14 పీహెచ్​సీలు ఉండగా, కొత్తగా నిర్మించిన రెండు భవనాలు ప్రారంభానికి నోచుకోలేదు.  4 సీహెచ్​సీలు, రెండు బస్తీ దవాఖానాలు, 106 సబ్ సెంటర్లు, వనపర్తి పట్టణంలో 2 అర్బన్​ హెల్త్​ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పెబ్బేరు పీహెచ్​సీలో డాక్టరు కూర్చునే గది, ఇంజెక్షన్లు వేసే గది, పిల్లల టీకాలను భద్రపరిచే గది, మెడిసిన్స్​ రూంలలో పైకప్పు పెచ్చులూడుతోంది.

ల్యాబ్, ఆఫీస్​ రూంలు పాతవి కావడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాన్పుల కోసం కొత్త భవనం కట్టడంతో కొంత వరకు మేలు జరిగింది. ఇక రేవల్లి సీహెచ్​సీ పైకప్పు అక్కడక్కడా పెచ్చులూడి పోతుంది. తాత్కాలిక మరమ్మతులతో వాటిని పూడ్చినా ప్రమాదం లేకుండా పోలేదు. చాలా చోట్ల శ్లాబుపై ఇసుక తేలి నాసిరకంగా తయారైంది. 

ఉండాల్సింది 30 మంది..ఉన్నది 17 మందే

జిల్లాలో మొత్తం అన్ని పీహెచ్​సీలు, సీహెచ్​సీలులో కలిపి 30 మంది రెగ్యులర్​ డాక్టర్లకు గాను 17 మంది మాత్రమే ఉన్నారు. వారికి కూడా డిప్యూటేషన్లు ఇవ్వడంతో ఒక్కొక్కరు రెండు లేదా మూడు చోట్ల డ్యూటీలు చేస్తున్నారు. అలాగే స్టాఫ్​ నర్సులు, ఏఎన్​ఎంలను డిప్యూటేషన్లపై ఇతర చోట్లకు పంపడంతో జిల్లాలో 50 దాకా స్టాఫ్ నర్సులు, 33 ఏఎన్ఎంల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నింటిని భర్తీ చేస్తే ప్రజలకు వందశాతం వైద్య సేవలు అందించవచ్చు.