- ఏడుగురు గైనకాలజిస్టులకు ఇద్దరే
- 184 బెడ్స్ కు 20 మంది నర్సులు
- చెకప్ కోసం వచ్చే గర్భిణులకూ స్టాఫ్ నర్సులే దిక్కు
- సకాలంలో వైద్యం అందక గర్భిణుల కష్టాలు
పెద్దపల్లి, వెలుగు: స్థానిక ఎంసీహెచ్ లో సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్టులకు ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రధాన ఆస్పత్రికి చెకప్ కోసం వచ్చే గర్భిణులకు స్టాఫ్ నర్సులే పరీక్షలు చేసి పంపిస్తున్నారు. ఎంసీహెచ్ఆస్పత్రిలో 100 బెడ్స్, జనరల్ హాస్పిటల్లో 84 బెడ్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 60 మంది స్టాఫ్‌నర్సులకు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో సకాలంలో సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సకాలంలో వైద్యం అందక..
రెండు రోజుల క్రితం పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన దివ్య ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. గైనకాలజిస్ట్అందుబాటులో లేరని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో దివ్యను అక్కడికి తీసుకెళ్లగా ఆదివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సాయంత్రమే ఆ శిశువు మృతి చెందింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకురాకపోవడంతోనే శిశువు మృతి చెందినట్లు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో కోపోద్రిక్తులైన దివ్య భర్త పవన్ కల్యాణ్, బంధువులు అదేరోజు రాత్రి శిశువు మృతదేహంతో పెద్దపల్లి ఆస్పత్రి ముందు బైఠాయించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే కొన్ని నెలల క్రితం చందపల్లికి చెందిన మహిళకు పీహెచ్సీలో డెలివరీ అయ్యింది. తర్వాతి రోజు రాత్రి ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రివేల డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో చికిత్స ఆలస్యమై బాలింత చనిపోయింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ వైద్యశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదని, కేవలం విచారణ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆశా వర్కర్లను కేర్ చేస్తలేరు..
గ్రామాల్లోని గర్భిణులకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటారు. అలాగే గర్భిణులు కూడా తమ సమస్యలను ఆశా వర్కర్లకే చెప్పుకుంటారు. ఆస్పత్రిలో పరీక్షల సమయంలో గర్భిణుల సమస్యలను ఆశాలు డాక్టర్ల దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తే డాక్టర్లు తమను పట్టించుకోవడంలేదని ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంక్వైరీ చేయిస్తాం
శిశువు చనిపోయిన ఘటనపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిస్తాం. నివేదిక ప్రకారం సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే హాస్పిటల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది ఉంటారు.
- డాక్టర్ శౌరయ్య, ఎంసీహెచ్.సూపరింటెండెంట్,పెద్దపల్లి