భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..ఫైర్ స్టేషన్లలో సిబ్బంది కొరత

  •     భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 6 స్టేషన్లలో 86 మంది ఉండాలి..
  •     ప్రస్తుతం ఉన్నది 48 మంది మాత్రమే.. మూడు కీలక పోస్టులూ ఖాళీనే.. 
  •     గతేడాది 234 ప్రమాదాలు.. రూ.7.57కోట్ల నష్టం
  •     ఈసారి మండుతున్న ఎండలు.. ముందస్తు చర్యలు కరువు
  •     జిల్లాలో అడవులు, పారిశ్రామిక ప్రాంతాలే ఎక్కువ 
  •     ఫైర్​స్టేషన్ల సంఖ్య పెంచాలని పలువురి డిమాండ్​ 

భద్రాచలం,వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫైర్​ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న అరకొర సిబ్బంది పనిభారం పెరిగి సతమతమవుతున్నారు. జిల్లాలో ఇల్లెందు, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెంలలో ఫైర్​ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 86 మంది సిబ్బంది ఉండాలి. కానీ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. కీలకమైన ఫైర్ ఆఫీసర్ల పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందులో ఇన్​చార్జ్ ఉన్నారు.  భద్రాచలం ఫైర్​ ఆఫీసర్​ మూడు నెలల లీవ్​పై వెళ్లారు. ఇక్కడ కూడా ఇన్​చార్జ్ ​ఆఫీసరే ఉన్నారు. ఫైరింజన్ల డ్రైవర్లు, కీలకమైన ఫైర్​మెన్లు కూడా లేరు. 

అగ్ని ప్రమాదాలు ఇక్కడే ఎక్కువ

అడవులు, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదాలు ఏటా ఎక్కువగానే జరుగుతున్నాయి. గతేడాది 234 ప్రమాదాలు జరిగాయి. రూ.7.57కోట్ల నష్టం వాటిల్లింది. అటవీ ప్రాంతాల్లో ఆకులు రాలే సమయంలో అగ్గి రాజుకుని ఊళ్ల మీదకు మంటలు వ్యాపిస్తుంటాయి. ఈ సమయంలో ఇళ్లు, గడ్డి వాములు తగులబడి పోతున్నాయి. ఐటీసీ, సింగరేణి, హెవీవాటర్​ ప్లాంట్, బీటీపీఎస్, కేటీపీఎస్​, నవభారత్ లాంటి పరిశ్రమల్లోనూ ఏటా ప్రమాదాలు జరుగుతుంటాయి. అరకొర సిబ్బంది ఉన్నా  ప్రాణ, ఆస్తి నష్ట నివారణపై ఎప్పటికప్పుడు యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకుంటున్నారు. దారులు లేని ఊళ్లకు చిన్న వాహనాలను పంపుతున్నారు. 

ఫైర్​స్టేషన్ల సంఖ్యను పెంచాలి

ఇప్పటి వరకు జిల్లాలో 6 ఫైర్​ స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఫైర్​స్టేషన్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో చర్లలో ఫైర్​ స్టేషన్​  ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఫైరింజన్​ వెళ్లాలంటే 60 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అక్కడి నుంచి ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర సరిహద్దుల్లోని గిరిజన గ్రామాలకు పోవాలంటే నరకయాతనే. చర్లలో ఫైరింజన్​ ఉంటే ప్రమాదాలను నివారించొచ్చు. 

సిబ్బంది కొరత వాస్తవమే..

ఫైర్ ​సిబ్బంది కొరత ఉన్నది వాస్తవమే. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఉన్న సిబ్బందితో ఎప్పుడూ అలర్ట్ ​ఉంటున్నాం. భద్రాచలంలో ఫైరింజన్​కు రిపేర్​ వస్తే గతేడాది అదనంగా మరో ఇంజన్​ను ఇచ్చారు. రిపేర్​ పూర్తయిన తర్వాత ఇప్పుడు రెండు ఫైరింజన్లు ఉన్నాయి. 

– ఆర్​.సూర్యారావు, ఇన్​చార్జ్ ఫైర్​ స్టేషన్ ​ఆఫీసర్, భద్రాచలం

ఎవరూ పట్టించుకోవట్లే

గిరిజన గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణ జరగాలంటే చర్లలో ఫైరింజన్​ ఏర్పాటు చేయాలి. ఈ విషయమై ఎన్నో ఏండ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నాం. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈసారైనా చర్లలో ఫైరింజన్​ ఏర్పాటు చేయాలి. 

 ఇర్పా రాజు, చర్ల