
వరంగల్ : కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఏకశీల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోట పవన్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారారని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూండాల పాలన సాగుతోందన్న ఆయన.. ఎమ్మెల్యే ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్టు పవన్ చెప్పాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. అతని ముఠా సభ్యులను జైళ్లో వేయాల్సిన పోలీసులు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు.
"మీరు మీ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించండి.. మీరు ఏ రాజకీయ పార్టీకి అనుబంధ విభాగం కాదు.. మీ జీతభత్యాలు ఏ రాజకీయ నాయకుడూ వాళ్ల ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు.. మీ పని మీరు చేయండి" అంటూ రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా చిత్రీకరించి, అందరికీ సర్క్యులేట్ చేసి మరీ బెదిరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదని చెప్పారు.
ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడంటూ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రగా కమిషనరేట్ కు బయలుదేరారు.