ఖమ్మం టౌన్, వెలుగు : కోవిడ్ పట్ల అలర్ట్గా ఉండాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల వైద్యశాఖ అధికారులతో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే నెల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడు కోవిడ్ లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 2,724 కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ బి.మాలతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్యాధికారి బి.సైదులు, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సదానందం తదితరులు పాల్గొన్నారు.
పిల్లల సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
ఉద్యోగినుల కోసం నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన క్రెచ్ (పిల్లల సంరక్షణ కేంద్రం)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. బుధవారం క్రెచ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రెచ్ కేంద్రంలో పిల్లల ఆట వస్తువులు, వారి సంరక్షణకు సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు.