
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేరళ, జార్ఖండ్ స్టేట్లలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా(హెచ్5ఎన్1) వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కోళ్లు, బాతులు, పావురాలు, ఇతర పక్షుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని తెలిపింది. చికెన్, గుడ్లు ముట్టుకున్నప్పుడు చేతులను వాష్ చేసుకోవాలని, పూర్తిగా ఉడికిన తర్వాతే వాటిని తినాలని సూచించింది.
జలుబు, దగ్గు, ఫీవర్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులకు సోకకుండా మాస్క్ ధరించాలని పేర్కొంది. రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని హెచ్చరించింది. వైరస్ లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. ఇప్పటివరకు ఏపీలోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, జార్ఖండ్‌లోని రాంచి, కేరళలోని అలప్పూజ, కొట్టాయం, పఠాన్‌మిట్ట జిల్లాల్లోని పౌల్ట్రీలలో ఏవియన్ ఇన్‌ఫ్యుయెంజా వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదు.