దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలి

  • మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, వెలుగు: తెలంగాణలోని ఎస్సీలకు కావాల్సింది వర్గీకరణ కాదని, సమగ్ర అభివృద్ధి అని తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థపాక అధ్యక్షుడు బేర బాలకిషన్ అన్నారు. మాల సంఘాల కన్వీనర్ గాదె కుమార్ అధ్యక్షతన ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో మండల స్థాయి మాల సంఘాల సమావేశం నిర్వహించారు.

బేర బాలకిషన్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి సీఎం కావడానికి లక్షల మంది మాలలు అహోరాత్రులు కష్టపడ్డారని, ఆ విషయాన్ని రేవంత్​మర్చిపోకూడదన్నారు. తెలంగాణలో జరగాల్సింది ఎస్సీల సమగ్ర అభివృద్ధి అని, వర్గీకరణ కాదన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని, ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. బడ్జెట్​లో వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని కోరారు.

బీజేపీ కోసం పనిచేస్తున్న మందకృష్ణ మాటలు నమ్మి ఎస్సీలు ఇబ్బందులపాలు కావద్దని సూచించారు. డిసెంబర్1న సికింద్రాబాద్​లో తలపెట్టిన మాలల బహిరంగ సభను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. ఆ సభతో మాలల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, నాయకులు కేఆర్ నాగరాజు, మేడిపల్లి సత్యంతోపాటు ఇతర మాల నాయకులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

మహేశ్వరం నియోజకవర్గ మాల ఉద్యోగస్తుల సంఘం నాయకులు యాలాల శ్రీశైలం, గాడి లక్ష్మయ్య, రాములు యాదయ్య, వీరమల్ల నరసింహ, సర్పంచుల సంఘం నాయకుడు యాలాల శ్రీనివాస్, ఆకుల మైలారం పాండు పాల్గొన్నారు.