ఇందల్వాయి, వెలుగు: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని మండలంలోని జీకే తాండాకు చెందిన గిరిజనులు శనివారం తహసీల్దార్ రోజా, ఎఫ్ఆర్ఓ హిమచందన కు వినతి పత్రం ఇచ్చారు. సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ జీపీ పరిధిలోని 180 సర్వే నెంబర్ లో గత 40 ఏండ్లుగా రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు పాస్‌బుక్ లు రాలేదని, గతంలో రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు జాయింట్ సర్వే నిర్వహించినా ఫలితం లేదని చెప్పారు. మళ్లీ సర్వే చేసి వివాదాలు పరిష్కరించాలని, పట్టాలు జారీ చేయాలని కోరారు.
హాకీ ట్రైనింగ్ క్యాంప్‌కు క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్, వెలుగు : జూనియర్ గర్ల్స్ హాకీ ట్రైనింగ్ క్యాంప్‌కు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా జట్టు ను శనివారం ఆర్మూర్ లో ఎంపిక చేశారు. టౌన్ లోని మినీ స్టేడియం లో ఎంపిక పోటీలకు 50 మంది క్రీడాకారులు హాజరు కాగా, ప్రతిభ కనబరిచిన 25 మందిని శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం ప్రెసిడెంట్
విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్థుల రమణ, కోశాధికారి పింజ సురేందర్, కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.
టీచర్లు మొబైల్ఆప్తో అటెండెన్స్ వేయాలె
ఆర్మూర్, వెలుగు : గవర్నమెంట్ టీచర్స్ మొబైల్ ఆప్ ద్వారా అటెండెన్స్ వేయాలని ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారాం సూచించారు. శనివారం మొబైల్ ఆప్ ప్రక్రియను ఆర్మూర్ టౌన్ లోని నవనాథపురం ప్రైమరీ స్కూల్ లో ప్రారంభించి, టీచర్స్ కు పలు సూచనలు చేశారు. టీచర్లు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అటెండెన్స్ నమోదు చేసుకోవాలని చెప్పారు.
రైల్వే స్టేషన్ లో వసతులు మెరుగుపరచండి
నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ లో వసతులను మెరుగుపరచాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ వర్షపు నీరుతో నిండిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీంతో స్పందించిన అర్వింద్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో శనివారం మాట్లాడారు. రైల్వే స్టేషన్ లో సమస్యలపై చర్చించారు. ప్రతి వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేస్టేషన్ లో వరదనీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని , కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని అన్నారు.
ఎక్కువ ఫీజులు వసూళ్లు చేసే
బీఈడీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
బోధన్, వెలుగు: ఎక్కువ ఫీజులు వసూలు చేసే బీఈడీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం ఆయన ప్రెస్‌మీట్ లో మాట్లడుతూ.. బోధన్ డివిజన్లోని బీఈడీ కాలేజీలు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, స్టూడెంట్ల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని తెలిపారు. అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాలేజీ స్టూడెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, కన్వీనర్ కోట నుంచి అడ్మిషన్ పొందిన వారినుంచి కూడా అధిక ఫీజులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్ కుమార్, రాజు, కళ్యాణ్ పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి
కామారెడ్డి, వెలుగు: భూముల్లో ఎప్పుడు ఒకే రకమైన పంటలు సాగు చేయవద్దని కామారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి సూచించారు. మహిళ కిసాన్ దివాస్‌ను పురష్కరించుకొని శనివారం మండలంలోని చిన్నమల్లారెడ్డిలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడులు సాధిస్తున్న మహిళ రైతులను సన్మానించారు. అనంతరం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని, వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్నారు. పంటలను మార్చటం వలన నేలలు సారవంతంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏలు అపర్ణ, రత్న, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ రత్నబాయి, రైతుబంధు ప్రెసిడెంట్ విఠల్‌రావు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలను పెంచాలె
నిజామాబాద్ టౌన్, వెలుగు: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను మరింత పెంచాలని రీజియన్ చైర్మెన్ ఉండవల్లి శివాజీ పిలుపునిచ్చారు. సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివాసరం నగరంలో అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సేవలపై సమీక్ష జరిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయా క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ కార్యదర్శి పి.లక్ష్మినారాయణ, జోన్ చైర్మన్ హర్దీప్ సింగ్,అనిల్ పటేల్,జహీరుద్దిన్,ఏరియా కో-ఆర్డినేటర్ ద్వారకా దాస్ అగర్వాల్ పాల్గొన్నారు.
కేజీబీవీలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే
మాక్లూర్, వెలుగు: మండలంలోని కేజీబీవీలో శనివారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహించారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ అరవింద్ స్టూడెంట్స్‌కు పలు సూచనలు చేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోవటం వల్ల వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ స్పెషల్ ఆఫీసర్ ప్రగతి, టి.బ్రీజారాణి, ఈశ్వరి, సవిత, అలేఖ్య, కృష్ణవేణి పాల్గొన్నారు.
వ్యాయామంతో బీపీ, షుగర్ దూరం
బాన్సువాడ రూరల్, వెలుగు: జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో (ఎంసీహెచ్)లో శనివారం జరిగిన నాన్ కమ్యూనికెబుల్ డీసీజ్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు. వయస్సు పెరిగిన తరువాత కొంతమందికి సహజంగానే బీపీ, షుగర్ జబ్బులు వస్తాయన్నారు. కామారెడ్డి జిల్లాలో షుగర్ వ్యాధి ఉన్న వారు 41,058 మంది, బీపీ ఉన్నవారు 21,217 మందిగా సర్వేలో నమోదైందని చెప్పారు. ఈ రెండు జబ్బులు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోందని చెప్పారు. అంతకుముందు బాన్సువాడ ఎంసీహెచ్ ఆస్పత్రి ప్రారంభించి, పిల్లల వార్డులో పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, ఆర్డీవో రాజా గౌడ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో గొడవ వ్యక్తి ఆత్మహత్య
మాక్లూర్, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుటుంబీకులు అనుమానించటంతో మనస్థాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మదన్ పల్లి కి చెందిన భూపతి మహిపాల్(40) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కుటుంబీకులు అనుమానించి, గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెందిన మహిపాల్ ఉరి వేసుకున్నాడు. భూపతి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన ఐదుగురిపై కేసు నమోదు చేయగా వారు పరారీలో ఉన్నట్టు ఎస్సై తెలిపారు.
లంపి స్కిన్ నివారణ టీకాలు
మాక్లూర్, వెలుగు: పశువులలో లంపి స్కిన్ నివారణ టీకాలు వేయించాలని పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ దేశ్పాండె అన్నారు. ప్రభుత్వం ఈ టీకాలు ఉచితంగా ఇస్తోందని తెలిపారు. శనివారం మండలంలోని గుత్ప, మామిడిపల్లి గ్రామాలలో 299 పశువులకు టీకాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గంట చిన్నయ్య, చింత మల్లారెడ్డి రైతులు పాల్గొన్నారు.
మోర్తాడ్ : పశువులకు లంపి స్కిన్ వ్యాక్సిన్ తప్పనిసరి వేయించాలని మోర్తాడ్ మండలవెటర్నరీ డాక్టర్ గౌతమ్ రాజ్ అన్నారు. మండల కేంద్రం లో గోవు జాతి పశువులకు శని వారం లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు చేశారు. ఈ సర్పంచ్ ధరణి ఆనంద్, వెటర్నరీడాక్టర్ గౌతమ్ రాజ్ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి ఆయన శనివారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్ పీ డీ సీ ఎల్) కు జీపీల నుంచి సుమారు రూ.35 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ఒక్కో డివిజన్ వారీగా పెండింగులో ఉన్న విద్యుత్ బకాయిల గురించి డీఎల్పీఓ లను అడిగి తెలుసుకున్నారు. జీపీలు చెల్లించాల్సి న బకాయిలను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచొద్దని అన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు స్టూడెంట్ల ఎంపిక
సిరికొండ,వెలుగు: మండలకేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు చెందిన ముగ్గురు స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ కల్పన తెలిపారు. కిందటి నెల 23 నుంచి 25 వరకు జోనల్ స్థాయిలో రంగారెడ్డిలో నిర్వహించిన క్రీడల్లో అండర్17 ఖోఖో లో మధు , అండర్ 17 వాలీబాల్‌లో గణపతి,అరవింద్ ప్రతిభకనబర్చి, రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ అయినట్టు చెప్పారు. ఈనెల 18నుంచి 20 వరకు ఏటూరు నాగారంలో జరిగే పోటీల్లో వాళ్లు పాల్గొంటారని అన్నారు.