పోడు రైతులకు ఈసారైనా.. ప్రభుత్వం పట్టాలిస్తదా?

పోడు రైతులకు ఈసారైనా.. ప్రభుత్వం పట్టాలిస్తదా?

రాష్ట్రంలో ఆదివాసీలు, గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూములకు జూన్ 24 నుంచి 30 వరకు వారం రోజుల పాటు పట్టాలిస్తామని గత నెల 23న సీఎం కేసీఆర్ ​మరోసారి ప్రకటించారు. పోడు రైతులకు పట్టాహక్కులు కల్పించడంతోపాటు వారికి రైతుబంధు అమలు చేస్తామని, రైతుల వివరాలను వెంటనే సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఆదివాసి జిల్లాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉన్నది. అటవీ హక్కుల చట్టం-2006లో అమల్లోకి వచ్చిన తర్వాత కొద్దికాలం అధికారంలో ఉన్న కాంగ్రెసు సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం.. ఆదివాసుల పోడు భూములపై హక్కును కల్పిస్తూ పట్టాలిచ్చింది. నాడు దరఖాస్తు చేసుకున్న వారిలో 96,679 మంది పోడురైతులకు 3,06,814 ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి రెండు సార్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ అనేకసార్లు హామీ ఇచ్చారు. కానీ గత 9 ఏండ్లలో ఒక్క ఎకరానికి, ఒక్క రైతుకు పట్టా ఇవ్వలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలు, 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కుర్చీ వేసుకొని కూర్చుని పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్​చెప్పారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, ములుగు, భూపాలపల్లి నర్సంపేట తదితర ఆదివాసి, గిరిజన నియోజకవర్గాల్లో కేసీఆర్​ పర్యటించి వారికి హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలిచ్చిన పరిస్థితి లేదు.

లక్షల దరఖాస్తులు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన,పేదల పక్షాన పోడుభూముల సమస్యలపై 50ఏండ్లుగా సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసి, ఇతర విప్లవ పార్టీలతో పాటు, సీపీఎం, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటి మీదికి వచ్చి ‘పోడు భూముల రక్షణ కమిటీగా’ ఏర్పడి అనేక ఉద్యమాలు నిర్వహించాయి. ఉద్యమాల ఫలితంగా వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పోడు భూములకు పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం.. కొన్ని కార్యాచరణలు ప్రకటించి వదిలేయడం సాగింది. గత సీఎస్​సోమేశ్​కుమార్​జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ.. 2021 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం, ఫారెస్ట్, రెవెన్యూ యంత్రాంగాలతోపాటు ఎమ్మెల్యేల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. దరఖాస్తులైతే తీసుకున్నారు. కానీ పట్టాలు ఇవ్వడం విస్మరించారు. మొత్తంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి11,63,096 ఎకరాలకు భూహక్కు పత్రాలు ఇవ్వాలని  3,52,022 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం భూములకు పట్టాలు ఇస్తుందా లేదా అటవీ శాఖ అధికారుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున తగ్గిస్తుందా? కొద్ది మందికి ఇచ్చి మొండి చేయి చూపిస్తుందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. 

ఆదివాసి, గిరిజనులపై దాడులు

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదివాసి గిరిజనులను ఆదుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు సరికదా హరితహారం పేరుతో వారికి ఉన్న భూములను బలవంతంగా గుంజుకునేందుకు పూనుకున్నారు. హరితహారం పేరుతో ఆదివాసి, గిరిజన పేదలు సాగుచేస్తున్న పోడుభూముల్లో గోతులు తవ్వడం, పంటలను విధ్వంసం చేసి మొక్కలు నాటడం, ఆదివాసి గ్రామాలను తగలబెట్టడం, ప్రజలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం, మహిళలనే విచక్షణ లేకుండా కొట్టడం లాంటి చర్యలకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 36 మంది ఆదివాసీ మహిళలను వారి చీరలను ఊడదీసి అమానుషమైన విధంగా చెట్లకు కట్టేసి కొట్టారు. వారి గుడిసెలను తగులబెట్టి, వారి ఆహారపు సామగ్రిని విధ్వంసం చేశారు.

రాష్ట్రమంతా ఈ దుర్మార్గపు చర్యపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేయగా, దాన్ని గొప్పకార్యంగా భావించిన సీఎం స్వయంగా అసెంబ్లీలోనే ఆ ఘటనను సమర్థించుకుంటూ అనాగరిక చర్యలకు పాల్పడిన వారికి కితాబులు ఇచ్చేవిధంగా మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో గంగారంలో ఆదివాసి మహిళలపై అటవీశాఖ అధికారులు, పోలీసులు అనాగరికంగా ప్రవర్తించారు. అదే జిల్లాలో బయ్యారం మండలం పందిపంపుల, కస్తూరి నగర్, అల్లిగూడెం, గూడూరు మండలం, పాకాల కొత్తగూడ మండలం తదితర ఏజెన్సీ మండలాల్లో దౌర్జన్యంగా పంటలను ధ్వంసం చేశారు. భూములు ఆక్రమించుకోవడం,అడ్డుకున్న ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపడం సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, బూర్గంపాడు, చండ్రుగొండ, జూలూరుపాడు, దమ్మపేట మండలాల్లో పోడు రైతులపై దాడులు జరిగాయి. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పోడు సాగుచేస్తున్న రైతులపై దాడులు, కేసులు అనేకం జరిగాయి. 

ఎన్నికల ఏడాది..

ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో పోడుభూములకు పట్టాలిస్తానని ప్రకటించడం సంతోషదాయకమే అయినప్పటికీ అనుమానాస్పదమైన పరిస్థితి కనిపిస్తున్నది. తొమ్మిదేళ్ల కాలంలో అనేకసార్లు వాగ్దానాలు ఇవ్వడం అందుకు కార్యాచరణ చేస్తున్నట్లు హడావుడి చేయడం దాన్ని మూలకు పడేయడం, పట్టాలివ్వకుండా 9 ఏండ్ల కాలం గడిపిన పరిస్థితి పోడురైతులు చూస్తున్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇప్పుడు ఇస్తున్న హామీనైనా సీఎం కేసీఆర్ అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పూనుకోవాలి. పోడురైతులపై పెట్టిన తప్పుడు  కేసులను ఎత్తేయాలి.  అటవీ హక్కుల చట్టంను అమలు చేయాలి

రాష్ట్రంలో ఆదివాసి, గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చేందుకు చట్టం ఉంది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..13 డిసెంబర్​2005 వరకు సాగుచేస్తున్న రైతులందరికీ చట్ట ప్రకారం పట్టాలు పొందేందుకు అర్హులు. 1969 వరకు షెడ్యూల్ ఏరియాలో నివాసముంటున్న గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చేందుకు అర్హత ఉంటుంది. 18 ఏండ్లు నిండిన వారిని యజమానులుగా గుర్తించి భూమిపై హక్కు కల్పించాలని అటవీ హక్కుల చట్టం చాలా నిర్దిష్టమైన ఆదేశాలను ఇస్తున్నది. పెసా చట్టం ఆదివాసి ప్రాంతాలకు తగిన రక్షణలు కల్పిస్తున్నది. ఇప్పటికే ఆదివాసి ప్రాంతాల్లో పెసా కమిటీలు ఉన్నాయి.

అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూముల దరఖాస్తులను సమగ్ర పరిశీలన చేసి అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు చట్టప్రకారంగా ఉన్నాయి. దరఖాస్తులను పరిశీలించి అర్హతలు లేకుంటే తిరస్కరించే అధికారం వాటికి ఉన్నది. చట్టబద్ధంగా అడవుల్లో నివాసముంటున్న ఆదివాసీలకు అడవిపై ఎన్ని హక్కులున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బుట్టదాఖలు చేస్తున్నది. రాజకీయ కారణాలతో ఏ అధికారం లేని ఎమ్మెల్యేలకు పోడుభూములపై పట్టాలిచ్చే కమిటీలకు అధికారం కల్పిస్తున్నది. ఇది చట్ట వ్యతిరేకం. 

- జే. సీతారామయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షుడు,  ఐఎఫ్​​టీయూ