Manu Bhaker: నా కుమార్తెను క్రికెటర్‌ని చేసుంటే బాగుండేది: మను భాకర్ తండ్రి

Manu Bhaker: నా కుమార్తెను క్రికెటర్‌ని చేసుంటే బాగుండేది: మను భాకర్ తండ్రి

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డుల నామినేషన్లలో రాజకీయ జోక్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో రెండు కాంస్య పతకాలను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భారత షూటర్ మను భాకర్‌కు ఖేల్ రత్న నామినేషన్లలో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. 

తాజాగా, ఈ వివాదంపై స్పందించిన మను భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ తన కుమార్తెను క్రికెటర్ చేసుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"ఆమె(మను భాకర్)ను షూటింగ్ క్రీడలో ఉంచినందుకు నేను చింతిస్తున్నా.. బదులుగా నేను ఆమెను క్రికెటర్‌ని చేసి ఉండాల్సింది. అప్పుడు ఆమెకు అవార్డులతో పాటు ప్రశంసలు దక్కేవి.  నా కూతురు ఒకే ఎడిషన్‌లో రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు..?" అని అను భాకర్ తండ్రి ఓ జాతీయ టైమ్స్ ఛానెల్‌తో మాట్లాడారు.

దరఖాస్తు చేసుకోలేదు.. 

అయితే ఈ వివాదంలో ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఖేల్ రత్న అవార్డు కోసం మను భాకర్ దరఖాస్తు చేసుకోలేదని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీనిని రామ్ కిషన్ భాకర్ ఖండించారు. ఆమె పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.

ALSO READ | Tanush Kotian: అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్.. ఎవరీ తనుష్ కోటియన్..?

సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత షూటర్ మను భాకర్ పేరును ప్రతిష్టాత్మక అవార్డుకు సిఫారసు చేయలేదు.అయితే, వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్రం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా గౌరవానికి నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

"ప్రస్తుతం నామినీల తుది జాబితా లేదు. క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా ఒకట్రెండు రోజుల్లో సిఫారసులపై నిర్ణయం తీసుకుంటారు. ఆమె పేరు తుది జాబితాలో ఉంటుంది" అని మంత్రిత్వ శాఖ వర్గాలు పిటిఐకి తెలిపాయి.