రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతుల రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వలేదు. అప్పు ఉన్న కారణంగా సర్కారు ఇచ్చిన రైతు బంధు పంట పెట్టుబడి కూడా బ్యాంకర్లు లోన్కింద పట్టుకున్నరు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసి పంట వేస్తే.. మొన్నటి వర్షాలకు మొలక దశలో ఉన్న పంటలన్నీ నీళ్లపాలయ్యాయి. ఇప్పటికే తెచ్చిన అప్పుకు మిత్తి పెరిగిపోతుండగా.. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేవారే లేకుండా పోయారు. రైతును పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండగా.. ప్రకృతి ప్రకోపంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అతి భారీ వర్షాలు, వరదలు ఉత్తర తెలంగాణను అతలాకుతలం చేశాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 6.01 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా ఇప్పటి వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 85 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 3.7 9 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అందులో పత్తి 38.48 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.21 లక్షల ఎకరాలు, పప్పు ధాన్యాలు 4.10 లక్షలు, మక్క 2.50 లక్షలు, 2.58 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి.ఈ పంటలన్నీ ప్రాథమిక దశలో ఉండగానే వర్షాలు పడటంతో నీటమునిగాయి. ఇప్పటికే ఒక్కో రైతు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు వేయగా.. అంతా వర్షార్పణమైంది. మరోసారి పంటలు సాగు చేయాలంటే సాగు ఖర్చు మూడింతలు పెరిగే అవకాశం ఉంది. వరదల కారణంగా పంట పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఏర్పడి అపార నష్టం వాటిల్లింది.
కౌలు రైతుల కంట కన్నీరేనా?
చారెడు భూమిలేని వేలాది మంది రైతులు వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలేస్తున్నారు. పంటలకు పెట్టుబడితోపాటు, పట్టదారుకు కౌలు రూపంలో కొంత నగదు మొత్తాన్ని చెల్లించి మరీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మొన్నటి వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కౌలు రైతులకు రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. పంటల బీమా పథకం, రైతు బంధు పథకం, బ్యాంకుల ద్వారా కల్పించే వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీలు లేవు. ఇవన్నీ అవకాశాలు ఉన్న సాధారణ రైతే నష్టపోతుండగా.. ఎలాంటి ఆసరా లేని కౌలు రైతులకు కన్నీరే మిగులుతోంది. వానా కాలం సీజన్లో పెట్టుబడి కోసం అన్నదాతలు బ్యాంకులను ఆశ్రయిస్తే బ్యాంకర్లు చెప్పులరిగేలా తిప్పించుకొని కేవలం 21.21 శాతం మాత్రమే(రూ. 8,637 కోట్లు) రుణాలు ఇచ్చాయి. కానీ వానాకాలం సీజన్ లో రూ.40,719 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా33.85 లక్షల మంది రైతులకు రుణాలు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 5.92 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. ఇందులోనూ ఎక్కువ రెన్యువల్సే ఉన్నాయి. కొత్తగా బ్యాంకు రుణాలు పొందిన రైతులు1.24 లక్షల మంది మాత్రమే. దీనికితోడు రుణమాఫీ పథకాన్ని మూడున్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాగదీస్తోంది. ఇప్పటివరకు34 వేల రూపాయల లోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు చెల్లించాకే పంట రుణాలను క్లియర్ చేసుకుందామని ఎదురుచూస్తున్న రైతులకు 2018 వరకు ఉన్న బకాయిలకు వడ్డీ మీద వడ్డీ జమ అవుతోంది.
పంట నష్టం ఇవ్వాల్సిందే!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే భారీ వర్షాలకు, వరదలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులు పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయారు. పంట నష్టం వివరాలను పక్కాగా అంచనా వేసి రైతులకు ఎకరానికి ఇంత చొప్పున పంట నష్టం వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. అప్పుడే వాళ్లు మళ్లీ పంటలు సాగు చేయగలుగుతారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం మనజాలదు. ఈ విషయాన్ని పాలకులు గ్రహించి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలి.
- తండ సదానందం,
టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్