ప్రీతిది హత్యా, ఆత్మహత్యా..? అనేది తేలకుండానే ఆత్మహత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆత్మహత్యాయత్నం అని చెప్పడానికి ఆధారాలు లేవన్న ఆయన.. అప్పుడే కేసు పక్కదారి పట్టిందని ఆరోపించారు. మెడికో ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రియాంక రెడ్డికి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
ప్రీతి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ చెప్పారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని తెలిపారు. ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చాలని, జ్యుడీషియరీ విచారణ జరపాలని కోరారు. మెడికో ప్రీతిది హత్యేనని గిరిజన సంఘం నేత శంకర్ నాయక్ ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలన్న ఆయన.. ఈ కేసులో మెడికోలు, వైద్యుల హస్తం ఉందని చెప్పారు.