ఓటీటీలకూ సెన్సార్ ఉండాలా?

ఓటీటీలకూ సెన్సార్ ఉండాలా?

         ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కొత్త ఫ్లాట్ ఫామ్ వెతుక్కుంటోంది. ఇన్నాళ్ళూ థియేటర్, టీవీ వరకే ఉన్న వీడియో ఎంటర్టైన్ మెంట్ ఓటీటీ కంటెంట్తో దూసుకుపోతోంది. దీని క్రేజ్.. సినిమాలూ, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్ని దాటిపోయింది. ఇవన్నీ సరే కానీ, సినిమా, సీరియల్స్కి ఉన్న సెన్సార్ రూల్స్ దీనికి వర్తించవా? వినోదం ఒక్కటే అయినప్పుడు ఒకే రూల్ లేకపోతే ఎట్లా? సినిమా, ఒటీటీ బిజినెస్లో పోటీ మీద పక్కన పెట్టినా సెన్సార్లేని కంటెంట్ వల్ల జనంపై ఉండే నెగెటివ్ ఎఫెక్ట్ని తప్పించేందుకు చర్చ జరగాలి.

సినిమాగా హిట్ అవదూ అనుకున్న సబ్జెక్ట్ని వెబ్ సిరీస్లో ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. అంతే కాదు ఒక సిరీస్లో ఎపిసోడ్స్ మంచి రేటింగ్స్ రాబడితే…. తర్వాత ఎన్ని పార్టులైనా తీసే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ మీద ఫోకస్ చేస్తున్నాయి. వెబ్ సిరీస్ ఫాలో అవటం లేదూ అంటే నేను వెనుకబడి పోయానేమో అని ప్రేక్షకుడే రిగ్రెట్ అయ్యేంతగా ప్రచారం జరుగుతోంది.

ఓటీటీ చుట్టు ముట్టింది…

ఓటీటీలో సినిమాకంటే ఎక్కువ సేపు కథ చెప్పే అవకాశం ఉండటం, తక్కువ ‘‘క్రూ’’తో షూటింగ్ చేసే వీలుండటం,  రిలీజ్ కోసం పెద్దగా కష్టపడే అవకాశం లేకపోవటంతో పాటు. సినిమాల్లో కనిపించే నెపోటిజం, స్టార్ అట్రాక్షన్ పేరుతో కొద్దిమంది చేతుల్లోనే సినిమా ఉండిపోవటం లాంటివి కూడా లేకపోవటంతో.., కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కీ, యాక్టర్స్కి ఓటీటీ మంచి అవకాశాలిస్తోంది. మనీ హెయిస్ట్, డార్క్, లూసిఫర్ లాంటి ఫారిన్ వెబ్ సిరీస్ లతో పాటు పాతాళ్ లోక్, మీర్జాపూర్, డెల్లీ క్రైం లాంటి ఇండియన్ వెర్షన్స్ కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ని ఆక్రమించేస్తున్నయ్. జీబీల కొద్దీ డాటా, ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్, స్మార్ట్ ఫోన్ స్ట్రీమింగ్తో ఇప్పుడు వరల్డ్ మొత్తం ఓటీటీ మేనియా ఆవహించింది. ఇప్పటి వరకూ చూడని కొత్త కాన్సెప్ట్స్, ఇంతకు ముందు పక్కన పెట్టిన భాష, ఫ్రేంలో, ప్రెజెంటేషన్లో, స్క్రీన్ ప్లేలో అన్నీ కొత్తగా ఉంటున్నాయి.

బాగానే ఉంది కానీ…

ఎప్పుడైనా సరే.. ఒక జనరేషన్ తర్వాత ప్రతీ దానిలోనూ మార్పు వచ్చినట్టే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లోనూ మార్పు వచ్చింది. సినిమా, టీవీలకి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వచ్చింది. కానీ…. ఇక్కడా సమస్యలున్నాయి. ఈ వెబ్ సిరీస్‍లు సినిమాటోగ్రఫీ చట్టం 1952 లేదా కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం 1995 పరిధిలోకి రావు. అంటే మన సెన్సార్ రూల్స్ ఈ కంటెంట్ మీద పని చెయ్యవు. ఇక వీటి మీద ఎంటర్టైన్మెంట్టాక్స్, జీఎస్టీ కూడా లేదు. కంటెంట్లో విచ్చలవిడిగా బూతులు, నూడ్ సీన్స్, డ్రగ్స్ తీసుకోవటం లాంటి సీన్లు, క్రైం వరల్డ్ లో జరిగే విపరీతమైన హింస నేరుగా సొసైటీలోకి వచ్చేస్తున్నాయన్నది ఒక విమర్శ. నిజానికి ఇండియన్ వెర్షన్గా వచ్చిన మీర్జాపూర్, రస్భరీ లాంటి వెబ్ సిరీసెస్లలో వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇక హింస, సెక్సువల్ అబ్యూజింగ్ కంటెంట్ అయితే చెప్పే పనేలేదు.  వీటి మీద కంట్రోల్ లేకపోతే ఇవి కొత్త జనరేషన్ మీద నెగెటివ్ ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఒక డ్రగ్ ఎడిక్ట్ ఎలా ఇంజక్షన్ చేసుకోవాలి? గన్ ఎలా యూజ్ చేయాలి?  అనే విషయాలని అవసరమైన దానికంటే అతిగా చూపిస్తున్నారు. చిన్న పిల్లలు, టీనేజర్స్ వీటికి ఈజీగా కనెక్ట్ అవుతారని సైకాలజిస్టులు అంటున్నారు.  ‘మీర్జాపూర్’ అనే వెబ్ సిరీస్ లో మనం మామూలుగా వాడటం మానేసిన బూతులు విపరీతంగా వినపడతాయి. తెలుగులోకి డబ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అవే పదాలని తెలుగులోనూ వాడారు.

తెలుగులోనూ…         

ఇప్పుడు తెలుగులోనూ వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఓటీటీల కంటే ముందే యూట్యూబ్లో ‘స్టోరీ డిస్కషన్, నిరుద్యోగ నటులు’ లాంటి వెబ్ సిరీస్లు వచ్చాయి. ఇవి జనంలోకి వెళ్లాయి. రెగ్యులర్ ఫార్మాట్ని బద్దలు కొట్టిన కొత్తరకం ఫ్రేమింగ్, ప్రజెంటేషన్తో ఆకట్టుకోగలిగాయి.  మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక కూడా వెబ్ సిరీస్ ప్రయత్నం చేసి కొంతవరకూ జనాలని ఆకట్టుకోగలిగింది. కానీ, ఇవి మరీ రొటీన్ సీరియల్ కంటే పెద్దగా ఏమీ లేవన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు జీ5, అమెజాన్ లాంటి ఓటీటీలు తెలుగు కంటెంట్ మీద ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. తెలుగులో వందల వెబ్ సిరీస్లు తీస్తున్నారు. ఈ మధ్యే లాంచ్ అయిన “కొత్త పోరడు” సిరీస్ ఒక ఊపు ఊపేసింది. “ఆహా”లోనే స్ట్రీమింగ్ అయిన తెలుగు వెబ్ సిరీస్ “సిన్” తెలుగు సినిమాకి  వెబ్ సిరీస్ని ఆల్టర్నేట్గా ప్రమోట్ చేయొచ్చనే నమ్మకం పెంచింది. అయితే ఇప్పుడు ఉన్న ఒకే ఒక ప్రశ్న. ఇక్కడ కూడా సెన్సార్ రూల్స్ లేవు కాబట్టి అబ్యూజింగ్, అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్, కంటెంట్ అలాగే వస్తుందా? వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నదే!

– నరేష్‌ కుమార్‌ సూఫీ

ఎలా ఆపగలం?

వెబ్ కంటెంట్ సెన్సార్ ఈజీగా అయ్యే పనికాదు. వెబ్ సినిమా వరకూ ఓకే కానీ. కొన్ని గంటల నిడివి ఉండే వెబ్ సిరీస్లు, వీడియో కంటెంట్ వందల కొద్దీ వస్తున్నాయి. అంటే ఒక వెబ్ సిరీస్ని  చూడాలంటే మామూలుగానే మనకి 5-6 గంటలు పడుతుంది. ఇక సెన్సార్ కోసం చూడాలి అంటే ఎంతమంది పని చెయ్యగలరు? ఇక మన వరకూ అనుకున్నా వరల్డ్ వైడ్ గా వచ్చే కంటెంట్ని ఎలా ఆపగలం? పోర్న్ అంటే దాన్ని మన వరకూ రాకుండా ఆ వెబ్ సైట్ని నిషేదించవచ్చు. కానీ ప్రతీ కంటెంట్నీ చూడటం కష్టం. ఓటీటీలలో కావాలని బూతులని ఇరికించటం వేరు, ఒక మనిషి మాట్లాడే భాషలో భాగంగా యాక్సెప్ట్ చేయటం వేరు. నిజానికి మోడ్రన్ లైఫ్ రిలేషన్స్ మీద ఇంకా బోల్డ్ కంటెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేవి హార్రర్, లేదంటే అడల్ట్ కంటెంట్. వీటికి పర్టిక్యులర్ సీజన్ అంటూ ఉండదు. ఎప్పుడైనా బిజినెస్ని పెంచగలవు. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతోంది.

– శశి (కంటెంట్ మేకర్)

అనవసరమైన భయమే

ఇంటర్నెట్ అనేది ఒక డెమోక్రాటిక్ ప్లేస్. ఫలానా వాళ్ళ కోసమని కాకుండా, అందరూ వాడుకునే ఫ్లాట్ ఫాం. ఇలాంటి చోట సెన్సార్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. నెగెటివ్ ప్రభావం చూపిస్తుందనే భయం అనవసరం. మన చుట్టూ ఉండే సోషల్ లైఫ్ కన్నా ఒక మూడూ నాలుగు గంటల కంటెంట్ వాళ్ల మీద పని చేస్తుందని ఒప్పుకోలేం. ఒక సినిమాలో ప్రజెంట్ చేసిన దానివల్ల మాత్రమే మార్పు వచ్చేస్తుందీ అనుకోలేం. ఒక పల్లెలో ఉండే మనిషి భాషని సెన్సార్ పేరుతో మార్చేశాక ఆ ఒరిజినల్ ఎస్సెన్స్ కూడా పోయినట్టే. టీనేజర్స్ సినిమాకంటే సొసైటీని చూసే  ఎదుగుతారు.

– ప్రియదర్శి (నటుడు)

పిల్లల్ని మార్చేస్తున్నాయ్

సినిమాలు ప్రభావం చూపించటం అంటే మొత్తంగా క్యారెక్టర్ని మార్చలేవు. కొన్ని విషయాల్లో  తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రీమారిటల్ సెక్స్ గురించి చెప్పిన సినిమా సేఫ్ సెక్స్ గురించి చెప్పదు. ఫ్రీ లైఫ్ గురించిన కంటెంట్ చెబుతున్నప్పుడు సోషల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతున్నది చెప్పదు. ఒక రకమైన భాషని, బాడీ షేమింగ్ లాంటి సీన్లనీ చూసిన పిల్లలు ఇంట్లో అలా ఉండక పోవచ్చు. కానీ, అదంతా సహజమనే గందరగోళంలో పడతారు. పక్కవాళ్ళని మానసికంగా బాధపెడుతున్నామనే విషయం వాళ్లకి తెలియకుండానే ఆ భాషని వాడేస్తారు.   మీరు చూస్తున్నారు కాబట్టి మేం చూపిస్తున్నాం అనటం మీరు చంపాలనుకుంటున్నారు కాబట్టే మేము ఆయుధాలు సప్లై చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది.

– రమాదేవి (సోషల్ యాక్టివిస్ట్)

ఫిల్టర్ చేసుకోవాల్సిందే

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ డాటా పిల్లలకూ అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఎలా వాడాలన్నది చెప్పాల్సింది పేరెంట్సే. వెబ్ సిరీస్ కంటెంట్ అభ్యంతరకరంగా ఉంటోంది అనుకుంటే. అంతకు మించిన పోర్న్, అడల్ట్ కంటెంట్, సాహిత్యం వెబ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి నుంచి దూరంగా ఉంచుతున్నాం కదా. ఇక్కడా అలాంటి జాగ్రత్తే తీసుకోవాలి. ‘రెబెల్’ అని చెప్పుకోవటానికే కావాలని తీసే కంటెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సొసైటీని ఓపెన్గా రిఫ్లెక్ట్ చేసే కంటెంట్ని  ఆపాలనుకోవటం మూవీ మేకర్కు ఉండే స్వేచ్ఛని హరించినట్లే. డార్క్ సైడ్ ఆఫ్ సొసైటీ గురించి చెప్పకుండా. “అంతా బాగానే ఉంది” అని భ్రమలో ఉంచటం కూడా తప్పే. ప్రతీ విషయంలోనూ ఇది మంచిది కాదని నిర్ణయించుకున్నట్టే ఇక్కడా చేయాలి. మన దగ్గరకు వచ్చే కంటెంట్ని ఫిల్టర్ చేసుకోవాల్సింది మనమే.

– స్వరూప్ తోటాడ (మూవీ అనలిస్ట్)