
జల్‌పల్లిలో వరద సహాయక చర్యలపై హైకోర్టు ఆగ్రహం
మున్సిపల్ కమిషనర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
ఇయ్యాల కమిషనరే వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులోని జల్‌పల్లి మున్సిపాల్టీ ఏరియాలో వరద నీటి తొలగింపునకు మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యూ ఇయర్ వచ్చే దాకా అలాగే వరద నీటిలో ఆ ప్రాంతం ఉండాలా అని సీరియస్ అయింది. భారీ వర్షాలకు వరదలు వచ్చి రెండు నెలలవుతున్నా సహాయ, పునరావాస చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని మండిపడింది. మంగళవారం జరిగే విచారణకు మున్సిపల్ కమిషనర్ గాడే ప్రవీణ్‌కుమార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
2 వారాలు పడుతుంది..
జల్‌పల్లి మున్సిపల్ ఏరియాలోని ఉస్మాన్‌సాగర్, షాహీన్‌నగర్, ఇతర ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయని, అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొంటూ ఆ ప్రాంతానికి చెందిన సయ్యద్ బిలాల్.. పిల్ వేశారు. హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది ఎన్.ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ.. వరద నీటి తొలగింపు పనులు జరుగుతున్నాయని చెప్పారు. భారీ ఎత్తున నీటి తొలగింపునకు చర్యలు తీసుకోడానికి ఇబ్బందులు ఉన్నాయని, చుట్టపక్కల ప్రాంతాల్లోకి తొలగించిన నీరు చేరి అక్కడ ముంపు సమస్య వస్తోందని చెప్పారు. జల్‌పల్లి ఏరియాలో వరద నీరు తోడేసేందుకు రెండు వారాలు పడుతుందని తెలిపారు. ఈ టైంలో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ‘రెండు నెలలైనా వరద నీటిని బయటకు పంపలేని దుస్థితిలో మనం ఉన్నామా?” అని ప్రశ్నించింది. నీటిని తోడేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించేందుకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.