మేము ఈమధ్యే పక్క ఊళ్లో కొంత స్థలం కొన్నాం. వచ్చే ఎండాకాలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాం. అయితే మా పాత ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది లేదు. వంటగదిలోనే షెల్ప్ లో పెట్టుకున్నాం. దానివల్లే మాకు అప్పులు అయ్యాయని చాలామంది అన్నారు. అందుకే కొత్త ఇంట్లో పూజ గది కట్టాలనుకుంటున్నాం. దాన్ని కచ్చితంగా ఈశాన్యంలోనే కట్టాలని కొంతమంది సూచిస్తున్నారు. అసలు దేవుడి గది ఎలా, ఎక్కడ ఉంటే మంచిది? అలాగే చనిపోయిన మా పెద్దల ఫొటోలను ఆ గదిలో పెట్టుకోవచ్చా? మా ఇంట్లో హాల్లో రాగి యంత్రాలను పెట్టుకున్నాం. వాటికి ఏ ఏ రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందో చెప్పండి ?
-బండారి యాదయ్య నల్లగొండ
మీ కొత్త ఇంట్లో పూజ గదిని ఈశాన్యంలో కొందరు పెట్టమంటున్నారని చెప్పారు. దాన్ని నేను సమర్థించను. ఎందుకంటే ఆ మూల బరువు ఉండకూడదు. అక్కడ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నట్లు లెక్క. ప్రత్యేకంగా అక్కడ దేవుడి పటాలను పెట్టనక్కర్లేదు. అసలు ఈశాన్యం మూల దీపారాధనలు చేయకూడదు. అలాగే, పూజ గదిని నైరుతి మూలన కాకుండా... పడమర గోడకు పెట్టి, దేవుడి ముఖం తూర్పుకు ఉండేలా చూసుకోవాలి. లేదా హాల్లో పెట్టుకునేట్లయితే... దేవుడి ముఖం పడమర చూడొచ్చు.
ALSO READ | ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
పూజగదికి తలుపు ఉండటం అన్నింటికన్నా ముఖ్యం. అది కుదరనప్పుడు కనీసం పరదా అయినా అడ్డు ఉండాలి. ఇంట్లో రాగి లేదా బంగారు యంత్రాలు ఉన్నప్పుడు, నిష్టగా ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజలు చేయాలి. లేదంటే దరిద్రం పట్టుకుంటుంది. అలా కుదరనప్పుడు వాటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది. అలాగే చనిపోయిన పెద్దల ఫొటోలను దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వాళ్లకు పూజ కూడా చేసుకోవచ్చు.