‘ఎన్నో సంవత్సరాల ట్రయలనే శిక్షనెదుర్కొన్న తర్వాత రాబోయే శిక్ష ఏపాటిది?’ నా హాజిర్హై అనే కవితలోని చివరి చరణాలివి. ఇప్పుడు ట్రయల్ కాదు. దర్యాప్తే చాలా సమయం తీసుకుంటోంది. ఏండ్ల తరబడి దర్యాప్తులు సాగుతున్నాయి. మన దేశంలో న్యాయమూర్తులు కోర్టుల్లో ఒకరకంగా, బయట జరిగే సెమినార్లలో మరో రకంగా ప్రవర్తిస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి బెయిల్ గురించి ఈ రెండు రకాల ధోరణలు కనిపిస్తున్నాయి. అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. చాలా మంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడంపై ఆందోళన వెలిబుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలని, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుట పడుతుందని ప్రధాని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులు, ఇదివరకే1/3 శిక్ష కాలాన్ని అనుభవించిన వాళ్లని, జైలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5న ప్రభుత్వానికి సూచించింది. అంతకు ముందు జులై11న సుప్రీం కొత్తగా బెయిల్చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్నేరం చేయని ఎంతో మంది వ్యక్తులు జైళ్లలో ఉన్నారని వ్యాఖ్యానించింది. అరెస్ట్చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమని, దాని వల్ల వ్యక్తి స్వేచ్ఛ పోతుందని, అందుకని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఈ అరెస్టులు చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. మన దేశంలో చాలా మంది జైళ్లల్లో ఉండిపోతున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారంగా 4,88,551 మంది బెయిల్రాక జైళ్లలో ఉండిపోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్‌కమిషన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం అంతగా కనిపించడం లేదు. అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేయడం తగదని, అరెస్ట్‌చేయడానికి న్యాయబద్ధత ఉండాలని జోగిందర్‌కుమార్(1994)కేసులో సుప్రీంతేల్చిచెప్పింది. అయినా పోలీసుల పనితీరులో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 41 నిబంధనలకు మార్పులు తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారాలను కల్పించింది. ఈ అధికారాల నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కోర్టు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. కానీ వాటిని అమలు చేసే మెజిస్ట్రేట్లు మన దేశంలో ఎంత మంది ఉన్నారు?
అరెస్టులు..
రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. జర్నలిస్టు మహమ్మద్ జుబేర్, నటి కేతకి చితాలే, బర్షశ్రీ బురాగోహైన్ అనే స్టూడెంట్ఇలా వారు అరెస్ట్అయి జైలులో ఉండాల్సి వచ్చింది. మన జైళ్లల్లో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. తీహార్ జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ కేసును పరిశీలిస్తే.. అతనికి జైలులో ఎలాంటి అడ్డంకులు లేవు. ఫోన్‌లు, ప్రత్యేక బ్యారక్ సౌలత్లు ఉన్నాయి. అవి పొందడానికి అతను ప్రతి నెలా రూ.1.5 కోట్లు చెల్లిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిలలాడాల్సి వచ్చింది. 2018లో అరెస్టయిన ప్రముఖ కవి వరవర రావుకు సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్మీద బెయిల్ ఇచ్చింది. ఆయనకు 82 ఏండ్లు ఉన్నాయని, కస్టడీ విచారణ 2018లో జరిగిందని, ఈ కేసులో చార్జిషీట్దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా
వార్తలొచ్చాయి.
నేరాలను వేర్వేరుగా చూడాలి..
అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్కేసులో సుప్రీంజారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్కఠినంగా అమలు చేస్తే అ అరెస్టులకు ఆటంకం ఏర్పడుతుంది. అంతరాయం కలుగుతుంది. రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. "జైలు కాదు బెయిల్"అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్మాదిరిగా మారడం శోచనీయం. "నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంత వరకు నేరస్తుడు అన్న చందంగా" మారడం విషాదం. రిమాండ్విషయంలో, బెయిల్మంజూరు విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్నేరాలను, మామూలు నేరాలను వేరు వేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి.
న్యాయమూర్తుల పాత్ర
ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయట పడటానికి క్రిమినల్జస్టిస్సిస్టమ్లోని అన్ని వ్యవస్థలు కృషి చేయాలి. “అరెస్ట్విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్స్టాంప్మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. దాన్ని ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కుల వైపు మీరు ఉండండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. అంతలోపు ఏండ్ల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండిపోకుండా చూడండి. ఇది సరైందేనా? వాళ్ల కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలోచించండి. ఇది న్యాయమా? అన్యాయమా.. ఆలోచించండి.
ఇది కష్టమైన ప్రశ్న కాదు’’ న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్.బి.లోకూర్ అన్న మాటలివి. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్‌కోర్టు న్యాయమూర్తులు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారి మీద వుంది.ఆ బాద్యతని నిర్వర్తించినందుకు ఎంత మందిని బదిలీలు చేస్తారు? ఈ మాటలని కూడా మదన్.బి.లోకూర్అన్నారు. ‘విచారణలో ఉన్న ఖైదీనా.. విచారణే అవసరంలేని ఖైదీనా’ తెలియచెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది.