ఇంతకాలం నాలుగు గోడల మధ్యనే దాగిపోయిన టాలెంట్ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా నలుగురికీ తెలుస్తోంది. ప్రపంచాన్ని చిన్న గ్రామంగా మార్చేసిన సోషల్ మీడియాని టిక్‌టాక్ యాప్ ఊపేస్తోంది. క్రమంగా ఇది ఓ పైత్యంలా మారిపోయింది. దాంతో ఈ యాప్‌ని బ్యాన్ చేయాలన్న డిమాండ్ బాగా పెరిగి పోయింది .
టిక్‌టాక్ పాపులారిటీకి ప్రధాన కారణం మనుషుల్లో దాగిన పాషనే కారణమంటున్నారు సైకాలజిస్టులు. ఈ పాషన్ కొన్నిసార్లు శ్రుతిమించిపోయేసరికి సోషల్ సైంటిస్టులు, సంప్రదాయవాదులు, ఇంటెలెక్చువల్స్ యాప్‌పై విరుచుకుపడుతుంటారు. ఆరు నెలల క్రితం ఇండియాలో జరిగింది అదే.
టిక్‌టాక్ యాప్ వల్ల యువత చెడిపోతోందని, గుట్టుగా ఉండాల్సిన కాపురాలు రోడ్డెక్కుతున్నాయని, ఎండ కన్నెరగని ఇల్లాళ్లు ‘హిప్ జర్కింగ్ డ్యాన్స్’లతో ట్రోల్ అవుతున్నారని బాగా విమర్శలు వస్తున్నాయి. 2018 సెప్టెంబరులో ఫ్రీడౌన్లోడ్ యాప్‌గా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో ప్రవేశించి… చాలా తొందరగా ఇండియన్ సోషల్ లైఫ్‌లో ఒక భాగమై కూర్చుంది. ఎనిమిది నెలల్లోనే ఈ యాప్ సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. దీని పేరు చెబితే యూత్ థ్రిల్లయిపోతుంటే, పొలిటీషియన్లు సోషియాలజిస్టులు కంగారు పడ్డారు.
మద్రాసు హైకోర్టులో ఒక పిల్ కూడా వేశారు. దాంతో ఈ యాప్‌పై నిషేధం విధించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న యాప్ స్టోర్లనుంచి టిక్‌టాక్‌ని తొలగించేశారు. ఆ తర్వాత యాప్ ఓనర్లు కొన్ని హామీలివ్వడంతో వారం రోజుల తర్వాత బ్యాన్ ఎత్తేశారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి యూజర్లు రెచ్చిపోయారు. తమ పైత్యాన్నంతా టిక్‌టాక్ వీడియోలలో చూపించాలన్న ఆశ పెరిగింది. దాంతో కంటెంట్ మొత్తం కొత్త షేప్ తీసుకుందని సామాజికవేత్తలు వాపోతున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోలుకూడా కనిపిస్తున్నాయంటున్నారు.
అమెరికాలో చైల్డ్ ప్రైవసీ యాక్ట్‌ని పట్టించుకోనందుకు టిక్‌టాక్‌పై కోట్లలో ఫైన్ పడింది. అలాంటి కట్టుదిట్టమైన వ్యవస్థ మన దగ్గరకూడా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో స్క్రీన్ మీదకు అమ్మాయిలు వచ్చేసి డ్యాన్స్ చేస్తూ చేస్తూ టాప్ ఓపెన్ చేసేయడం, లో దుస్తులు కనిపించేలా అసభ్యంగా ప్రవర్తించడం, నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, రకరకాలుగా సెక్సువల్ పోజులు ఇవ్వడం బాగా ఎక్కువయ్యాయని విమర్శలున్నాయి. దీంతో టిక్‌టాక్‌ని దేశం నుంచి తరిమేయాలని ఆరెస్సెస్ అనుబంధ సంఘాలుకూడా మోడీ సర్కారుకి మొరపెట్టుకున్నాయి.
టిక్‌టాక్, హెలో యాప్‌లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ, స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్విని మహాజన్ ప్రధాని మోడీకి లెటర్లు రాశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, యాంటీ–నేషనల్ కంటెంట్‌ని ఆప్‌లోడ్ చేస్తున్నారని ఆరోపించారు. ముంబైకి చెందిన ముగ్గురు యూజర్లు ‘దేశంలో దండు దాడులు పెరగడంవల్ల ఒక వర్గం యువత టెర్రరిజంవైపు మళ్లుతున్నారు’ అంటూ కొన్ని పోస్టులు పెట్టడాన్ని మహాజన్ తన లేఖలో ప్రస్తావించారు. ఆ సందర్భంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ (మెయిటీ) 24 రకాల ప్రశ్నలను టిక్‌టాక్‌కి, హెలో అనే మరో యాప్‌కి వేసింది. వాటికి సరైన సంజాయిషీలు ఇవ్వకపోతే పర్మినెంట్ బ్యాన్ విధిస్తామని హెచ్చరించింది. ఈ రెండు యాప్‌లు చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ రూపొందించినవే.
150 దేశాలు, 75 భాషల్లో..
మ్యూజిక్ అప్లికేషన్లకున్నంత డిమాండ్ మరి దేనికీ ఉండదు. ఎప్పటికప్పుడు మారుతున్న అభిరుచులకనుగుణంగా యూత్ టేస్ట్‌కి తగ్గట్టు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశిస్తుంటాయి. ఈ రోజు ఉన్నది రేపటికి రోతగా మారిపోయే స్పీడ్ యుగం కాబట్టి, ఏదైనా కొత్త యాప్ మార్కెట్టులో రాగానే… చక చకా డౌన్లోడ్ చేసేసుకోవడం యూత్‌కి అలవాటు. ఏమాత్రం వాళ్లకు టచింగ్‌గా ఉన్నా దానికి అతుక్కుపోతారు. ‘టిక్ టాక్’ సక్సెస్‌లో అదే కీలకం. 2012లో జాంగ్ యిమింగ్ తయారు చేసిన ఈ యాప్… 2016 సెప్టెంబరు వరకు నత్తనడగ్గా ఉండేది. చైనాలో ‘డౌయిన్’ పేరుతో లాంచింగ్ కాగానే పాపులర్ అయ్యింది. పోయినేడాది ఆగస్టులో ‘మ్యూజికల్ డాట్ లి’ యాప్‌ని కలిపేసుకున్నాక టిక్‌టాక్ పాపులారిటీ ఝామ్మని పైకి లేచింది. మ్యూజికల్ లి సబ్స్క్రైబర్లందరూ టిక్‌టాక్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం 150 దేశాల్లో 75 భాషల్లో టిక్‌టాక్ చాలా యాక్టివ్‌గా ఉంది.
టిక్‌టాక్ చైనా వెర్షన్ ‘డౌయిన్’ ఎదగడానికి మరో చాన్స్కూడా కలిసొచ్చింది. మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్న పండోరా, స్పాటిఫై లాంటివి మూత పడడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి టిక్‌టాక్‌పై పడింది. ఇదే జోరు కంటిన్యూ అయితే వచ్చే ఏడాదికి ప్రపంచంలోనే నెంబర్–1 డౌన్లోడింగ్ యాప్ అవుతుందని అంచనా. దీనిని గూగుల్ స్టోర్స్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2018 సెప్టెంబర్‌లో యాప్ డౌన్లోడ్ సదుపాయం కల్పిస్తే… రెండు నెలలు తిరిగేసరికి థర్డ్ ప్లేస్ చేరుకుంది. ప్రస్తుతానికైతే యాప్ స్టోర్లలో టిక్‌టాక్ ఆరో స్థానంలో ఉంది.
ఈ యాప్‌ని చూసేవాళ్లు కనీసం గంట సేపయినా దానికి అతుక్కుపోతున్నట్లు డేటా లెక్కలు చెబుతున్నాయి. కొందరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని స్టోరేజ్ సరిపోక, కొంతకాలానికి డిలీట్ చేయడం, మళ్లీ మళ్లీ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా రిపీట్ డౌన్లోడింగ్ అనేది 127 కోట్ల సార్లు జరిగినట్లుగా డేటాలో తేలింది. టిక్‌టాక్ యాప్‌ని యూజ్ చేసేవాళ్లలో మగవాళ్లు 52 శాతం ఉండగా, ఆడవాళ్లు 45 శాతం ఉన్నారు. ఏజ్ వైజ్‌గా చూస్తే… 19 ఏళ్లవాళ్లు 20 శాతం మంది, 24 ఏళ్లలోపు యువత 33 శాతం, 30 ఏళ్లలోపువాళ్లు 28 శాతం, 35 ఏళ్లలోపువాళ్లు 14 శాతం మంది ఉన్నారు. అంటే, యూత్ ఈ యాప్‌కి బాగా ఎడిక్ట్ అయ్యింది. మొత్తం యాప్ యూజర్లలో 19–30 వయసువాళ్లు 81 శాతం!.
దీనికింత పాపులారిటీ రావడానికి కారణమేమిటంటే… సమాధానం చాలా సింపుల్. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లవర్ ఎవరైనాగానీ ఎవరి సాయం లేకుండా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. తమలో దాగి ఉన్న టాలెంట్‌ని ఒక చిన్న వీడియో రూపంలో టిక్‌టాక్‌లోకి అప్లోడ్ చేయొచ్చు. విపరీతంగా నచ్చేసిన ఒక డైలాగ్‌ని, పొద్దస్తమానం నోట్లో నానుతూ ఉండే పాటని, కలలోనైనా భయపెట్టేసే అభిమాన విలన్ మేనరిజాన్ని… ఇలా దేన్నయినా వీడియోగా షూట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కళలు లేకపోయినా ఫర్వాలేదు. తమకు నచ్చిన పని లేదా తమ దగ్గరున్న వర్క్ స్కిల్, తాము తిరిగిన టూరిస్ట్ ప్లేస్, తాము కలిసిన సెలబ్రిటీతో సెల్ఫీ వగైరాలైనా చిన్న వీడియో చేసేసి టిక్‌టాక్‌లోకి ఎక్కించేయడమే! దీనికోసం పెద్ద పెద్ద కెమెరాలు, లేదా ఎడిట్ సూట్లు, మ్యూజిక్ మిక్సింగ్, డబ్బింగ్ లాంటివేవీ అక్కర్లేదు. చేతిలో 4జీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అలా షూట్ చేయి, ఇలా లోడ్ చేయి… దట్సాల్!
ఫీచర్స్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంవల్ల అప్లికేషన్ మోనాటనీ ఉండడం లేదు. అమెచ్యూర్ యూత్ లేదా సాధారణ మహిళ తీసే వీడియోని కావలసినట్లుగా ఎడిట్ చేసుకోవడానికి ఫిల్టర్స్‌ని కూడా ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లెందరో తమకు తెలిసిన విద్యను పదిమందికి చూపించడానికి ఉత్సాహపడుతున్నారు. అందుకే చాలా తక్కువ కాలంలోనే వేగంగా యూత్‌ని ఆకట్టుకుంది. లోలోపల తన్నుకుంటూ వచ్చే ఉత్సాహానికి టిక్‌టాక్ ఒక సూటబుల్ ప్లాట్‌ఫారంగా మారింది. దీని హెడ్‌క్వార్టర్స్ చైనాలోని షాంగై నగరంలో ఉండగా, మరో ఆఫీసు కాలిఫోర్నియా (అమెరికా)లోని శాంటా మోనికాలో ఉంది. డౌన్లోడ్ చేసుకున్న ఏరియాని, దేశాన్నిబట్టి ఆయా భాషల్లో చేసిన వీడియోలనే చూపించడం టిక్‌టాక్ ఆల్గారిథమ్స్ ప్రత్యేకత. దాంతో యూజర్స్ ప్రతి ఒక్కరూ తమ దేశానికి చెందిన యాప్‌గానే సొంతం చేసుకుంటున్నారు. ఈ యాప్ సక్సెస్‌కి ఇదికూడా ఒక కారణం.
ఎంటర్ టైన్ మెంటే కాదు…కోట్లలో రెవెన్యూ కూడా
టిక్‌టాక్‌ని జస్ట్ వారం రోజులపాటు బ్యాన్ చేస్తే ఆ కంపెనీకి వచ్చిన నష్టమెంతో తెలుసా? రోజుకు 5 లక్షల డాలర్లు (దాదాపుగా 3 కోట్ల 55 లక్షల రూపాయలు)! అంతేకాకుండా, 300 మంది ఉద్యోగాలు గాలిలో దీపంగా మారాయి. ఈ లెక్కల్ని బ్యాన్ విధించిన రోజుల్లో మద్రాసు హైకోర్టుకి టిక్‌టాక్ ఓనర్ బైట్‌డ్యాన్స్ ఇచ్చింది. ఇండియాలో టిక్‌టాక్ యూజర్ల సంఖ్య ఆ రేంజ్లో ఉంది మరి. ప్రపంచంలో 100 కోట్ల మంది టిక్‌టాక్ యూజర్లుండగా, వాళ్లలో 30 కోట్ల మంది ఇండియన్లే!
దీనిలో కంటెంట్ విషయంలో తల్లిదండ్రులు, పొలిటీషియన్లు అభ్యంతరాలు పెట్టడంతో వారం రోజుల పాటు బ్యాన్ చేసింది. తగిన చర్యలు తీసుకుంటామన్న బైట్‌డ్యాన్స్ హామీతో మరలా అనుమతించారు. బ్యాన్ సమయంలో మొత్తంగా 60 లక్షల తప్పుడు వీడియోల్ని టిక్‌టాక్ తొలగించేసింది.
టిక్‌టాక్‌పై ఒక్క ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ అభ్యంతరాలున్నాయి. పిల్లల ప్రైవేసీ చట్టాన్ని ఉల్లంఘించిందని తేలడంతో అమెరికా 57 లక్షల డాలర్ల జరిమానా విధించింది. చిన్న పిల్లలు ఈ యాప్‌ని వాడకుండా ఏజ్ గేట్ ఉండాలని ఆదేశించింది. టిక్‌టాక్ దెబ్బకి ట్విటర్ యాజమాన్యంలోని ‘వైన్’, చైనాకి చెందిన ‘క్యుయిషౌ’ యాప్‌లు మూతపడ్డాయి.
టిక్‌టాక్ యూజర్లు ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీల్లోనూ, పెద్ద పట్టణాల్లోనూ ఉంటారు. వీళ్లకు ఉపయోగపడే వస్తువులు, గార్మెంట్లు, ఇతర యాక్సెసరీల కంపెనీలు ఈ యాప్‌లో యాడ్స్ ఇస్తుంటాయి. వీళ్ల టార్గెట్ ఆడియన్స్ ప్రధానంగా యువత, మిడిల్‌క్లాస్ కుటుంబాల మహిళలు ఉంటారు. ఇలాంటి షార్ట్ వీడియోలపై పోయినేడాది 200 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారని, 2020లో ఈ మొత్తం 650 కోట్ల డాలర్ల వరకు పెరగవచ్చని అంచనాలున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లలో లాభపడడానికి ఈ షార్ట్ వీడియోలను కంపెనీలు బాగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ఏదైనా ఒక కంపెనీ 14,500 డాలర్లను (దాదాపు రూపాయల్లో 10 లక్షల 30 వేలు) అడ్వర్టయిజ్మెంట్లపై ఖర్చుచేస్తే, ‘విచాట్’ యాప్‌లో లక్షమంది, వీబో యాప్‌లో 40 లక్షల మంది చూస్తారు. అదే గనుక, టిక్‌టాక్‌లో ఖర్చు పెడితే 60 లక్షల మంది చూస్తారు’ అని ఫోర్‌క్యాస్ట్ అనలిస్ట్ మీనాక్షి తివారీ చెప్పారు. ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, సౌత్ కొరియాల్లో 47 కోట్ల డాలర్ల వరకు యాడ్ మార్కెట్ ఉండొచ్చని అంచనా. ఈ రెవెన్యూ కోసమే టిక్‌టాక్ యాప్‌ని యాంటీ–సోషల్ కంటెంట్ లేకుండా చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
టిక్‌టాక్ పిచ్చి ముదిరితే...
రాజ్‌కోట్‌లో ఇంద్రజిత్ జడేజా అనే వ్యక్తి నడి రోడ్డుపై జీపును తగలెట్టాడు. టిక్‌టాక్ కోసం ఒక ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… జడేజా తన జీపు మీద పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఫీట్లో అతని చేతులుకూడా కాలిపోయాయి. పోలీసులు చాలా సెక్షన్ల కింద జడేజాని అరెస్టు చేశాడు.
విదేశాల్లో ఒక టిక్‌టాక్ చాలెంజ్కోసం యువతులంతా పెదాలపై జిగురు పూసుకోవడం మొదలెట్టారు. నెయిల్ పాలిష్‌ను పై పెదాలపై వేసుకోవడంతో చర్మం కాలిపోయి కొందరు బాధలు పడ్డారు. పెదవులపై సున్నితమైన చర్మం ఉంటుందని డాక్టర్లు హెచ్చరించడంతో ఈ చాలెంజ్‌ని బ్యాన్ చేశారు.
చైనాలో 14, 12 ఏళ్లున్న ఇద్దరు ఫ్రెండ్స్ ఆల్కహాల్‌తో పాప్‌కార్న్ వేపుకోవాలనుకున్నారు. ఒక బౌల్లో ఆల్కహాల్ వేసి దానిపైన జొన్న గింజలు వేసి సరదా పడ్డారు. పెద్ద మంటకోసం మరింత ఆల్కహాల్ వేసేసరికి పేలుడు జరిగి ఒక అమ్మాయి చనిపోయింది. రెండో అమ్మాయికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇవి మచ్చుకి ఒకటి రెండు ఘటనలు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో జరిగాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
యాంటీ ఇండియా కంటెంట్‌గానీ, అశ్లీల వీడియోలుగానీ అప్లోడ్ కాకుండా తీసుకునే చర్యలేమిటి?
యూజర్ల వయసును నిర్ధారించడానికిగల మెకానిజం ఏమిటి?
యూజర్ల డేటా ఎక్కడా లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
టిక్‌టాక్ లెక్కలు :
ప్రపంచంలో డౌన్లోడయ్యే యాప్‌ల్లో ఆరో ప్లేస్
154 దేశాల్లో ఈ యాప్ వినియోగం
75 భాషల్లో యాప్‌ని చూసుకునే అవకాశం
వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల మంది యూజర్స్
ఇండియాలోనే 30 కోట్ల మంది యూజర్లు
దాదాపుగా 10 లక్షల పేజీలను చూస్తున్నట్లు అంచనా
హార్ట్స్ ఫీచర్ : గుండె ఆకారంలో ఉండే సింబల్ ఇది. ఫేస్బుక్లో లైక్ లాంటిది. అయితే, ఈ యాప్‌లో ఎన్నిసార్లయినా లైక్ చేయొచ్చు. ప్రతి సింగిల్ హార్ట్ (లైక్)ని ఒక్కొక్కటిగా కౌంట్ చేస్తుంది.