గోల్డెన్ వీసా కోసం.. బంగారు భూమిని వదిలి పెట్టాలా?

గోల్డెన్ వీసా కోసం..  బంగారు భూమిని వదిలి పెట్టాలా?

సంపన్న విదేశీయులను ఆహ్వానించడానికి ట్రంప్ ప్రభుత్వం పన్నిన పన్నాగమే ఐదు మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డ్ పథకం.  విదేశీ మోజులో అత్యాశకు పోయి స్వదేశంలో కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమెరికాకు అందించేందుకు సిద్ధపడేవారిని ఆకర్షించే  పనిముట్టు అమెరికా ‘గోల్డ్ కార్డ్ వీసా’ పథకం.  అమెరికాలో విలాసమైన జీవన విధానం విదేశీయులను ఆకర్షిస్తోంది.  అదే సమయంలో గన్ కల్చర్, ప్రకృతి వైపరీత్యాలు, శ్వేత జాతీయుల పక్షపాత ధోరణి వంటి ఇబ్బందులు ఉన్నా డాలర్ల మీద మోజు, విదేశీ వ్యామోహంలో వాటిని లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే  ట్రంప్ ఓవల్ కార్యాలయంలో  వినూత్నమైన  ‘గోల్డ్ కార్డ్ వీసా’  కార్యక్రమాన్ని  ప్రకటించారు. 

ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్ల  డాలర్లతో (సుమారు 44 కోట్ల 61లక్షల రూపాయలు) సంపన్న వర్గానికి చెందిన ఏ విదేశీయులైనా కొనుగోలు చేసుకోవచ్చు. 1990లో రూపొందించబడిన విధానంలో EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్​లో ఉన్న పెట్టుబడి నిబంధన కన్నా ఇది చాలా ఎక్కువ.  ఈ కార్డు పొందిన సంపన్న విదేశీయులు అమెరికాలో నివసిస్తూ పనిచేసుకోడానికి, నిబంధనల మేరకు పౌరసత్వాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. త్వరలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు, ఉద్యోగాలు సృష్టించే కంపెనీల్లో  పెట్టుబడి పెట్టేవారికి అమెరికాలో నివసిస్తూ పనిచేసుకోవడానికి అనుమతించే EB-5 వీసాలను మంజూరు చేస్తారు. 

పెట్టుబడితో నివాస అర్హతగా గోల్డెన్ వీసా

గోల్డెన్ వీసాను  ఒకవిధంగా  ‘పెట్టుబడితో నివాసార్హత’గా  చెప్పుకోవచ్చు.  కొన్ని ఇతర దేశాల్లో కూడా ఈ విధానం కొనసాగుతోంది.  మాల్టా లాంటి యూరోపియన్ యూనియన్ సభ్యదేశంలో పౌరసత్వాన్ని కొనుగోలు చేయడం ద్వారా అన్ని సభ్య దేశాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు, విద్యను అభ్యసించవచ్చు, ఉపాధి పొందవచ్చు. అమెరికాలో  గోల్డెన్ వీసా పొందగోరే వ్యక్తులు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం, ఇల్లు కొనడం, కంపెనీల్లో భాగస్వామిగా చేరడం లేదా కొత్త వ్యాపార సంస్థలను సృష్టించడం, విరాళం ఇవ్వడం వంటివి చేయవచ్చు. 

అమెరికాలో శాశ్వత నివాసితులకు జారీ చేసే గ్రీన్ కార్డ్ పర్మిట్‌‌ల మాదిరిగానే గోల్డ్ కార్డ్ పెట్టుబడిదారులకు చట్టపరమైన నివాస అధికారాలు లభిస్తాయి.  పౌరసత్వానికి  మార్గం సుగమం అవుతుంది.  గోల్డ్ కార్డ్  వీసాలు సాధారణంగా  సంపన్న  దేశాలకు చెందిన ధనవంతులు కొనుగోలు చేస్తారు. ఇటీవల భారతదేశంలోనూ సంపన్న వర్గాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, కొందరు సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు గోల్డ్ కార్డ్ దిశగా మొగ్గు చూపే అవకాశం ఉంది. గతంలో బర్త్ టూరిజం ద్వారా  తమ పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కును  పొందిన కొందరు సంపన్న వర్గాల వారికి రాజమార్గంలో నివాసార్హత పొందగలిగే అవకాశం ఇది. 

అమెరికాలో సగటు జీవన వ్యయం 

అమెరికాలో  జీవన వ్యయం సగటున నెలకు సుమారు 2వేల డాలర్లు.  అది దాదాపు లక్షా అరవై ఎనిమిది వేల భారతీయ రూపాయలకు సమానం.  ఆ మొత్తంతో  మనదేశంలోనే   అత్యంత సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు.  ఇండియాలో చిటికెలో జరిగిపోయే డిజిటల్  చెల్లింపులతో  పది నిమిషాల్లో ఆహారం, సరుకుల డెలివరీ పొందే  సౌలభ్యం ఉంది.  డబ్బుంటే జాలీగా గడిపే జీవనం, వీటన్నిటికీ మించి జననీ జన్మభూమిశ్చ అనే భావన. అంతగా విదేశీ మోజు పెరిగినప్పుడు ఏ అమెరికాకో,  బ్రిటన్‌‌కో పర్యటనకు వెళ్లి ఎంజాయ్‌‌ చేసి రావచ్చు. 

కానీ, అక్కడే ఉండిపోవాలనుకునేవారు  భారతదేశంలో లైఫ్‌‌ను, బంధుమిత్రులను మిస్‌‌ అవుతారు. భారతదేశం విద్యా వైద్య రంగాలలోనూ ఏ దేశానికీ తీసిపోనంతగా ప్రతిభా సామర్థ్యాలను కలిగి ఉంది.  సాంకేతిక  పరిజ్ఞానంలో,  మేధాసంపత్తిలో  మనకు మనమే సాటి. కాబట్టే  పాశ్చాత్య దేశస్తులు మన దేశ నిపుణుల మేధోవలసలను ప్రోత్సహిస్తున్నారు.  

విదేశీ పెట్టుబడిదారుల వల్ల సమకూరే మూలధనం అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు,  స్థానిక  అమెరికన్లకు ఉద్యోగాలను  సృష్టించేందుకు సహాయపడుతుందని ట్రంప్  భావిస్తున్నారు.  అమెరికాలో పెరుగుతున్న జాతీయ రుణం వారికి ఒక దీర్ఘకాలిక సమస్యగా మారింది.  ప్రస్తుత జాతీయ రుణం 36.22 ట్రిలియన్ల డాలర్లుగా పేరుకుపోయిన దృష్ట్యా ఈ రుణ భారాన్ని తగ్గించే దిశగా ట్రంప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.

ప్రభుత్వం ప్రోత్సహించ వద్దు

అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా పథకాన్ని ప్రకటించిన మరుసటి రోజే అక్కడి ఇమ్మిగ్రేషన్ లా నిపుణులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ట్రంప్ మాత్రం చట్టపరంగా లోతుగా అధ్యయనం చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది, ఆచరణ యోగ్యమైనది అని ముక్తాయించారు.  ఏదిఏమైనా భారతదేశానికి సంబంధించినంత వరకు ఇటువంటి ఖరీదైన వలసలను ప్రభుత్వం  ప్రోత్సహించక పోవడమే మేలు.  మేధోసంపత్తిని ఆకర్షించే  విదేశీ పెట్టుబడులను కఠినతరం చేయడం ద్వారా సంపద మార్పిడిని నిరోధించవచ్చు. 

మనదేశ వనరులను,  ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకొని సంపన్నులుగా మారిన అదృష్టవంతులు జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కాకుండా విదేశాలకు సంపదను తరలించడం ఎంతవరకు సబబో ఆత్మవిమర్శ చేసుకోవాలి.  గోల్డ్ కార్డ్ వీసాపై పెట్టుబడి పెట్టే 45 కోట్ల రూపాయలతో  మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలోనే మరిన్ని వ్యాపారాలు, పరిశ్రమలను స్థాపించవచ్చు.  స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయవచ్చు. రామాయణంలో  కన్నతల్లి,  జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవని రాముడు లక్ష్మణుడికి బోధించిన విషయం దేశ ప్రజలందరికీ మార్గదర్శకం. 

- ఆర్​సి కుమార్, 
సోషల్ వర్కర్