రోజూ భోజనంలో చివరిగా పెరుగు లేదా మజ్జిగ లేనిదే కొంతమందికి అసలు భోజనం పూర్తి చేసిన ఫీలింగే ఉండదు. సమ్మర్‌లో అయితే పొరబాటున కూడా మిస్ చేయరు. కానీ, చలికాలంలో తినొచ్చా? తినకూడదా? అన్న అనుమానం చాలా మందిలో ఉండేదే. తింటే ఎక్కడ జలుబు చేస్తుందో, గొంతు పాడవుతుందోనన్న భయంతో కొంత మంది తినాలని ఉన్నా బంద్ చేస్తారు. ఎక్కువ మందిలో ఉన్న నమ్మకం కూడా ఇదే! మరి నిజమేంటి? దీన్నే ఫాలో అవ్వాలా? విటమిన్లు, ప్రొటీన్లు, కాలిషియం వంటి అనే అనేక పోషకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పెరుగు విషయంలో ఈ డైలమాకు ఆయుర్వేదం, సైన్స్ సమాధానాలేంటో చూద్దాం.
ఆయుర్వేదం ఏం చెబుతోంది..
చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పు, చలి కారణంగా సహజంగా ఉండే ఇబ్బందే ఇది. ముక్కులు పట్టేయడం, గొంతులో గరగరలా ఉండి గల్ల వస్తుంటుంది. అయుర్వేదం పరిభాషలో దీన్నే కఫం అంటారు. ఊపిరితిత్తుల అంతర్భాగంలో గోడలకు చెమ్మ పట్టి ఊరే ద్రవమే ఈ కఫం. చలికాలంలో ఇది ఎక్కువై జలుబు, దగ్గు లాంటి వస్తుంటాయి. ఈ సమయంలో పెరుగు తింటే కఫం ఇంకా ఎక్కువయ్యే చాన్స్ ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అస్తామా, సైనస్ లాంటి సమస్యలు ఉన్న వారిలో ఇది మరింత తీవ్రమై బాగా ఇబ్బందిపెడుతుంది. సో చలికాలంలో పెరుగు తినకపోవడమే మేలని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అసలు వద్దని సూచిస్తోంది. పోషకాల కోసం రాత్రులు పాలు తాగి, మధ్యాహ్నం వేళ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మేలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రెమిడీతో బెటర్..
ఆయుర్వేదం ప్రకారం కఫానికి విరుగుడు వెల్లుల్లి. కాబట్టి పెరుగు బాగా ఇష్టంగా తినేవాళ్లు కచ్చితంగా పోపు పెట్టుకుని తినడం మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందులో కనీసం మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంత జీలకర్ర వేయడం వల్ల కఫాన్ని అడ్డుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా చేసినా కూడా రాత్రి వేళ పెరుగును దూరం పెట్టడమే మంచిదని చెబుతున్నారు.
సైన్ ఏం చెబుతోంది
పెరుగులో శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియాలు, బీ12 విటమిన్, కాలిషియం వంటి పోషకాలు ఫుల్‌గా ఉంటాయని సైన్ చెబుతోంది. రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ ఉపయోగపడుతుందు. చలికాలంలోనూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే జలుబు, దగ్గు, ఆస్తమా, పలు రకాల శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్లు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పెరుగు తీసుకోవద్దని సూచిస్తున్నారు. చలికాలంలో వీలైనంత వరకు పగలు మాత్రమే పెరుగు తినాలంటున్నారు. అయితే కొంత మంది నిపుణులు సీ విటమిన్ ఉండే ఫుడ్ తీసుకుంటే జలుబు లాంటి త్వరగా తగ్గుతాయని, సో చలికాలంతో తినొచ్చని చెబుతున్నారు.
MORE NEWS:
షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి
నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు
అయితే ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు మాత్రం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. సహజంగా పెరుగు తోడుకున్న కొద్ది గంటల్లోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం బిజీబిజీ రోజుల్లో పాలలో తోడు వేసుకుని, పెరుగు చేసుకుని తినేవాళ్లు చాలా తక్కువ. షాప్‌లో ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్లే ఎక్కువైన నేపథ్యంలో ఫ్రిజ్‌లో పెట్టకుండా వేసుకోవడం దాదాపు కష్టమే. కాబట్టి రాత్రి పూట వీలైనంతగా పెరుగు వేసుకోకపోవడమే మేలని డాక్టర్లు చెబుతున్నారు.