14 మంది ప్రధానుల కృషిని కళ్లకు కట్టేలా మ్యూజియం

ఇప్పటి వరకు దేశానికి ప్రధానులుగా సేవలు అందించిన 14 మంది కృషి, చేసిన గొప్ప పనులను కళ్లకు కట్టేలా మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పక్కనే కొత్తగా ప్రధానమంత్రి సంగ్రహాలయ (పీఎం మ్యూజియం)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ప్రారంభించబోతున్నామన్నారు. అలాగే ఢిల్లీలో నిర్మించిన అంబేద్కర్ మ్యూజియాన్ని కూడా అదే రోజు ప్రారంభిస్తున్నామని చెప్పారు.

ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశానికి ప్రధాని సేవలు అందించిన ప్రతి ఒక్కరి కృషిని ప్రతిబింబించేలా తమ ప్రభుత్వం మ్యూజియాన్ని రూపొందించిందన్నారు. కేవలం ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే గత ప్రధానులందరి కృషిని గుర్తించిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు మోడీ సూచించారు. ఢిల్లీలో నిర్మించిన అంబేద్కర్ మ్యూజియాన్ని ఏప్రిల్ 14న ప్రారంభిస్తున్నామని, దానిని బీజేపీ ఎంపీలంతా సందర్శించాలని చెప్పారు.

ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. సామాజిక న్యాయం అనే అంశంపై ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సభలు, సమావేశాలు నిర్వహించడం అన్న అంశంపై చర్చించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఉండగా.. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాగా, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను పొడిగించినందుకు ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.