బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‎లో నోటోరియస్ క్రిమినల్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజం

బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‎లో నోటోరియస్ క్రిమినల్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజం

ముంబై: మహారాష్ట్ర సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ నుండి వివరాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‎లో శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పునావాలా ఉన్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. 

బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్స్ శివకుమార్ గౌతమ్, శుభమ్ లోంకర్ విచారణ సందర్భంగా ఈ విషయం బయటపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల సమాచారంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న అఫ్తాబ్ పూనావాలాకు భద్రత పెంచడం వల్ల ఈ ముఠా అతనిపై దాడి చేయడం మానుకున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. 

ALSO READ | ఇలా ఎలా నమ్ముతారో.. గాడిద పాల పేరిట వంద కోట్ల మోసం.. నిండా ముంచేశారు..!

కాగా, శ్రద్ధా వాకర్ మర్డర్ యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన విషయం తెలిసిందే. 2022, మే 18న శ్రద్ధా వాకర్ ప్రియుడు అప్తాబ్ పునావాలా ప్రియురాలిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రంపంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇంట్లోని ఫ్రిజ్‎లో దాచిపెట్టాడు. శరీర భాగాలను ఒక్కొటి చొప్పున దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేవేశాడు. శ్రద్ధా వాకర్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. పోలీసులే ఖంగుతినే విషయాలు వెల్లడి అయ్యాయి. 

శ్రద్ధా వాకర్‎ను ఆమె ప్రియుడు అప్తాబ్ ఫునావాలా అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో  2022, నవంబర్ 12న అఫ్తాబ్ పునావాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా  ప్రస్తుతం అఫ్తాబ్ పునావాలా తీహార్ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో అఫ్తాబ్ పునావాలాను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారంతో తీహార్ జైల్లో అఫ్తాబ్‎కు భద్రత పెంచినట్లు తెలిసింది.