
నలుగురు ఆడవాళ్ల ఆలోచన.. ఏ దిక్కూ లేని మూడు వందల మంది ఆడవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపింది. ముప్పై ఏళ్ల క్రితం మూడు వేల రూపాయలతో మొదలైన ‘శ్రామిక్ మహిళా వికాస్ సంఘం’ ఇప్పుడు, మూడు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ఓటమిని తట్టుకుని, విజేతలుగా
నిలిచిన నలుగురు మహిళల జర్నీ.
భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించే వాళ్లు లేక.. పేదరికంలో ఉంటూ ఏ పని చేయాలో తెలియక.. ఎలాంటి ఆసరా లేక ఒంటరిగా ఉంటున్న ఆడవాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నలుగురు ఆడవాళ్లు మొదలుపెట్టిన ట్రస్ట్ ‘శ్రామిక్ మహిళా వికాస్ సంఘం’. ముంబైలోని వసాయి ప్రాంతానికి చెందిన ఇందుమతి బార్వే, ఉషా మనెరికా, జయశ్రీ సామంత్, సుభదా కొతావాలే అనే నలుగురు ఆడవాళ్లు 1991లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. పేద, ఒంటరి మహిళలకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘శ్రామిక్ మహిళా వికాస్ సంఘం’ పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. ఈ నలుగురూ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం విశేషం. ఇందుమతి టీచర్.. హోమ్ మేకర్. మిగతా ఇద్దరూ సోషల్ సర్వీస్ చేసేవాళ్లు. ఆడవాళ్లకు ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, ఈ నలుగురు కలిసి దీన్ని స్థాపించారు.
మొదటి బిజినెస్ ఫెయిల్
ఈ ట్రస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు 1980 దశాబ్దం చివర్లో కొందరు ఆడవాళ్లతో అప్పడాలు తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే, సరైన పెట్టుబడి లేని కారణంగా ఈ వ్యాపారం ఎక్కువకాలం నడవలేదు. దీంతో నష్టాలమధ్య ఈ వ్యాపారాన్ని ఆపేశారు. ఆ తర్వాత మరో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నారు. వంట చేసే బిజినెస్ అయితే, పెద్దగా నష్టం ఉండదనుకున్నారు. అలా తమకు తెలిసిన ఒంటరి ఆడవాళ్లతో కుకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అప్పటికి ఆ నలుగురి దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. పాత స్కూల్ ప్రాంగణంలో, తక్కువ డబ్బులతోనే చిన్న క్యాంటిన్ స్టార్ట్ చేశారు. కొంతకాలంపాటు రెంట్ లేకుండా, క్యాంటిన్ నడుపుకునేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారు. క్యాంటిన్‌కి కావాల్సిన సరుకుల్ని స్థానికులే అందించారు. అందరి సహకారంతో, క్యాంటిన్ స్టార్ట్ అయింది.
మెల్లిగా లాభాల్లోకి
డ్రైవర్లు, రిక్షావాలా, లేబర్స్, బ్యాచిలర్స్ వంటి వాళ్ల కోసం తక్కువ డబ్బుకే భోజనం పెట్టేవాళ్లు. రెండు రోటీలు, అన్నం, పప్పు, కూరలు, పచ్చడి కలిపి అప్పట్లో పది రూపాయలకే ఇచ్చారు. అయితే, మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు. ఆ తర్వాత లోపాల్ని సరిదిద్దుకుంటూ, క్వాలిటీ మెయింటెయిన్ చేయడంతో కస్టమర్స్ ఎక్కువయ్యారు. లాభాలు రావడం మొదలైంది.
మూడు కోట్ల టర్నోవర్
ముంబైలో ఆరు అవుట్‌లెట్స్‌లో ప్రస్తుతం 175 మంది పనిచేస్తున్నారు. మొత్తంగా 300 మంది మహిళలకు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోని క్యాంటిన్ల ద్వారా ఉపాధి దొరికింది. బిజినెస్ బాగా డెవలప్ అయ్యి, ఏడాదికి మూడు కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో పని చేస్తున్న ఆడవాళ్లకు పెన్షన్స్, హెల్త్ స్కీమ్స్, లోన్స్ వంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ‘ఆరు అవుట్‌లెట్స్‌లో కొన్ని నష్టాల్లో ఉన్నాయి. అయినా రేట్లు పెంచకుండా సర్వ్ చేస్తున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా ఎందరో ఆడవాళ్లకు ఉపాధి దొరుకుతోంది. ఇది చాలా సంతోషాన్నిస్తోంది’ అని చెప్పింది ట్రస్ట్ స్థాపకుల్లో ఒకరైన ఉషా మనేరికా.