
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌కు శ్రవణ్ రావు సమాధానాలు
- ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు
- ఇంట్లో సీజ్ చేసిన ఫోన్లే వాడినట్లు వివరణ
- 10 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావును సిట్ అధికారులు 10 గంటల పాటు విచారించారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో వినియోగించిన సెల్ఫోన్లపై ఆరా తీశారు. ఇప్పటికే సీజ్ చేసిన 3 ఫోన్లకు సంబంధించిన పాస్వర్డ్లు చెప్పాలని అధికారులు కోరగా.. తనకు తెలీదని.. గుర్తుకు లేదని చెప్పినట్లు సమాచారం. తన ఇంట్లో నుంచి సీజన్ చేసిన 3 ఫోన్లనే వాడానని చెప్పినట్లు తెలిసింది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రవణ్‌రావు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరయ్యాడు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అతన్ని ప్రశ్నించింది. రాత్రి 10 గంటలదాకా విచారణ కొనసాగింది. అయితే, సిట్ ప్రశ్నలకు శ్రవణ్ రావు సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. దీంతో మళ్లీ పిలిచినప్పుడు ఎంక్వైరీకి రావాలని సూచించారు.
కాల్‌డేటా, వాట్సాప్ ఆధారంగా ప్రశ్నలు
ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ రావు టీమ్‌కు అందజేసిన ఫోన్ నంబర్లు, పొలిటికల్ సర్వే వివరాలను సిట్ అధికారులు రాబడుతున్నారు. గత నెల 29న 6 గంటల పాటు ప్రశ్నించారు. 2 సెల్‌ఫోన్లను అందించాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కు వాడిన సెల్‌ఫోన్లను అప్పగించేందుకు శ్రవణ్ రావు చాకచక్యంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నెల 2న జరిగిన విచారణలో పాత ఫోన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శ్రవణ్‌రావు వినియోగించిన ఫోన్లపైనే సిట్ దృష్టి సారించింది.
ఇప్పటికే సేకరించిన శ్రవణ్‌రావు కాల్‌డేటా సహా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్‌వోటీ మాజీ ఎస్పీ ప్రణీత్‌రావు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. శ్రవణ్‌రావు వాట్సాప్ చాటింగ్స్‌తో పాటు ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపిన సెల్‌ఫోన్ల డేటాను సేకరిస్తున్నది. 28 వరకు సుప్రీం ఆదేశాలుండటంతో మళ్లీ శ్రవణ్ రావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.