ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హవా నడుస్తుంది. క్వాలిఫయర్ 1 లో భాగంగా మంగళవారం (మే 21) సన్ రైజర్స్ హైదరాబాద్ పై జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొట్టి జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్స్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో తొలిసారి ఫైనల్‌కు చేరింది.
కేకేఆర్ ను ఫైనల్ కు చేర్చిన అయ్యర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. అతని సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన అన్నను ఏకంగా ఆకాశానికెత్తేసింది. శ్రేయాస్ అయ్యర్ ను కింగ్ తో పోలుస్తూ తన అన్నపై అభిమానాన్ని చాటుకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా "శ్రేయాస్ కింగ్ ఆఫ్ జంగిల్" అని పోస్ట్ చేసింది. చుట్టూ పులులు ఉన్న ఈ ఫోటోలో అయ్యర్ బ్యాట్ పట్టుకొని వాటికి రాజులా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మ్యాచ్ లో అయ్యర్ కేవలం 24 బంతుల్లోనే అజేయంగా 58 పరుగులు చేసాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 రన్స్‌కే ఆలౌటైంది. తర్వాత కోల్‌కతా 13.4 ఓవర్లలో 164/2 స్కోరు చేసి గెలిచింది. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.