కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్స్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అయ్యర్ 2020లో ఆ జట్టును తొలిసారి ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. ఆ తరువాత 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా అతను 2023 సీజన్‌కు దూరమయ్యాడు. 2024సీజన్ లో కోల్‌కతా జట్టును టాప్ లో నిలిపాడు.
మే 21వ తేదీ మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన .తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 రన్స్‌కే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 55), క్లాసెన్ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), కమిన్స్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
ఆ తర్వాత కోల్‌కతా 13.4 ఓవర్లలో 164/2 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయాస్ 24 బంతుల్లో 58 పరుగులతో అద్బుతమైన స్కోరుతో ముందుండి నడిపించాడు. వెంకటేష్ అయ్యర్ కూడా క్రీజులో నాటౌట్‌గా నిలిచి 28 బంతుల్లో 51 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం రాజస్తాన్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ విన్నర్‌తో హైదరాబాద్ శుక్రవారం రెండో క్వాలిఫయర్ ఆడుతుంది.