13, 35, 4*, 0, 6, 31, 26, 0, 12, 4. గత పది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చేసిన స్కోర్లివి. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో చేసినవి 131 రన్సే. సగటు 14.55 మాత్రమే. ఎక్స్‌పీరియన్స్, టాలెంట్, స్పిన్‌ను బాగా ఆడే సత్తా ఉన్నప్పటికీ కొన్నాళ్లుగా పేలవంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ జట్టుకు భారం అవుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌లో ఫెయిలైన అతను ఇంగ్లండ్‌తో హైదరాబాద్ టెస్టులోనూ జట్టును ఆదుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశ పరిచిన అయ్యర్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. శుక్రవారం వైజాగ్‌లో మొదలయ్యే రెండో టెస్టులో అయినా సత్తా చాటకుంటే టీమ్‌లో ప్లేస్ కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచాడు.
ఆరంభంలో అదరగొట్టి..
ముంటై టీమ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొట్టిన అయ్యర్ ఇంటర్నేషనల్ వన్డే, టీ20ల్లో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 2022లో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చాన్స్ వచ్చింది. కాన్పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన అయ్యర్ టెస్టుల్లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో మెరుగ్గా ఆడే ఇండియా బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ కాస్త ఆలస్యంగా రెడ్ బాల్ క్రికెట్‌లో అడుగు పెట్టినప్పటికీ స్టార్టింగ్‌లో తన మార్కు చూపెట్టాడు. శ్రీలంక, బంగ్లాదేశ్‌పై రెండేసి ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 13 నెలల కిందట చిట్టగాంలో హైటెన్స్ ఛేజింగ్‌లో కీలకమైన 29 రన్స్‌తో బంగ్లాపై ఇండియాను గెలిపించాడు. కానీ, ఆ తర్వాత ఆడిన పది ఇన్నింగ్స్‌ల్లో అతని హయ్యెస్ట్ స్కోరు 35 మాత్రమే. ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, సెంచూరియన్, కేప్‌టౌన్, హైదరాబాద్ ఇలా వేదికలు మారుతున్నా టెస్టుల్లో అయ్యర్ ఆట మాత్రం మెరుగవ్వడం లేదు.
మిడిలార్డర్ బాధ్యత శ్రేయస్‌దే
గతేడాది వెన్నుగాయానికి సర్జరీ చేయించుకోవడంతో కొన్నాళ్లు ఆటకు దూరమైన అయ్యర్ రీఎంట్రీ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలతో దుమ్మురేపాడు. కానీ, టెస్టుల్లో మాత్రం ఆ స్థాయి ఆట చూపెట్టడం లేదు. రెడ్ బాల్‌ను ఎటాక్ చేయాలా? డిఫెన్స్ చేయాలా? అనే డైలమాలో వికెట్ పారేసుకుంటున్నాడు. హైదరాబాద్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను ఛేజింగ్‌లో తీవ్రంగా నిరాశ పరిచాడు. టర్నింగ్ బాల్‌ను బాగా ఆడే అయ్యర్ ఓపిగ్గా క్రీజులో నిలిచి ఉంటే ఇండియాకు ఓటమి తప్పించే వాడు. ఈ పరాజయంలో మిగతా బ్యాటర్ల పాత్ర ఉన్నప్పటికీ మిడిలార్డర్‌లో తనపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయ్యర్‌పై ఉంది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, జడేజా కూడా దూరమవ్వడంతో మిడిలార్డర్‌లో శ్రేయస్ అత్యంత సీనియర్ అవుతున్నాడు. కేఎల్ ప్లేస్‌లో సర్ఫరాజ్, పటీదార్‌లో ఒకరు అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో టాపార్డర్ ఫెయిలైతే కొత్త ఆటగాడితో మిడిల్‌లో ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను అతనే తీసుకోవాల్సి ఉంటుంది. వైజాగ్‌లో అయినా తను ఫామ్ అందుకుంటాడేమో చూడాలి.