హైదరాబాద్, వెలుగు : ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ టీమ్ నుంచి తప్పుకోగా తాజాగా ప్రాక్టీస్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. నెట్ సెషన్ త్రోడౌన్స్ ఎదుర్కొంటున్న టైమ్‌లో ఓ బాల్ అయ్యర్ కుడి ముంజేయికి బలంగా తగిలింది. దాంతో నొప్పితో ఇబ్బంది పడి వెంటనే ప్రాక్టీస్ ఆపేశాడు. దాంతో ఫిజియో బ్యాండేజ్ వేయగా.. పక్కకు వెళ్లిపోయిన అయ్యర్ చేతికి చాలాసేపు ఐస్‌ప్యాక్ పెట్టుకొని కనిపించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత అతను మళ్లీ ప్రాక్టీస్‌కు వచ్చాడు. అయితే అయ్యర్ గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది. ఇక, మంగళవారం ఇండియా, ఇంగ్లండ్ జట్లు ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఉదయం సెషన్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనగా.. మధ్యాహ్నం సెషన్‌లో రోహిత్‌సేన చెమటలు చిందించింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్ప అందరు ఆటగాళ్లు ఈ సెషన్‌కు హాజరయ్యారు.
ముందుగా ప్రధాన స్టేడియంలో ఆతిథ్య జట్టు ఆటగాళ్లంతా వామప్స్ చేశారు. కాసేపు వాలీబాల్ ఆడారు. అనంతరం నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. రోహిత్ చాలా సేపు త్రో డౌన్స్ ఎదుర్కొంటూ కనిపించాడు. అతని పక్క నెట్స్‌లో యశస్వి జైస్వాల్, గిల్ బ్యాటింగ్ చేశారు. వీళ్లకు అశ్విన్‌తో పాటు సిరాజ్, ముకేశ్, లోకల్ బౌలర్లు బంతులు వేశారు. రోహిత్ కాస్త త్వరగానే ప్రాక్టీస్ ముగించుకొని ద్రవిడ్‌తో కలిసి ఒకే కారులో హోటల్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ నెట్స్‌లోకి వచ్చారు. తొలుత లోకల్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు. ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్లు ట్రై చేశాడు. ఈ క్రమంలో ఓసారి బౌల్డ్ అయ్యాడు. ఇక స్పిన్నర్ల బౌలింగ్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా కేఎస్ భరత్ కీపింగ్ చేశాడు. మరోవైపు ఉదయం సెషన్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ ఇంగ్లండ్ ప్లేయర్లు ఎండ, వేడికి ఇబ్బంది పడ్డారు. ఇంగ్లండ్ ప్రాక్టీస్‌లో నెట్ బౌలర్‌గా ఉన్న హెచ్‌సీఏ అండర్19 జట్టు స్పిన్నర్ వై. యశ్వీర్ ఓ ఫ్లయిటెడ్ బాల్‌తో ఆ టీమ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను బౌల్డ్ చేసి ఆశ్చర్యపరిచాడు.
రాహుల్ బ్యాటర్‌గానే : ద్రవిడ్
ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడని.. ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఇటీవల సౌతాఫ్రికా టూర్‌లో రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ, ఈ సిరీస్‌లో అతను కీపింగ్ చేయడని మంగళవారం టీమ్ ప్రాక్టీస్ సెషన్‌కు ముందు ద్రవిడ్ మీడియాతో స్పష్టం చేశాడు. ‘రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు. టీమ్ సెలెక్షన్ టైమ్‌లోనే ఈ విషయంపై క్లారిటీతో ఉన్నాం. ఐదు టెస్టుల సిరీస్ కావడంతో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశాం’అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ ఆటగాడు శ్రీకర్ భరత్, ధ్రువ్ జురేల్‌లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.
తొలి టెస్టుకు స్పిన్ వికెట్
తొలి టెస్టులో టీమిండియా స్పిన్ అస్త్రంతో ఇంగ్లండ్‌ను పడగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియంలో స్పిన్ వికెట్ రెడీ అవుతోంది. మ్యాచ్‌కు రెండ్రోజుల ముందు వికెట్‌ను చూస్తుంటే స్పిన్‌కు అనుకూలించేలా కనిపిస్తోందని హెడ్ కోచ్ ద్రవిడ్ చెప్పాడు. మరోవైపు ఈ వికెట్‌పై బ్యాటర్లతో పాటు బౌలర్లకూ సపోర్ట్ లభిస్తుందని హెచ్‌సీఏ అధికారి ఒకరు చెప్పారు. మ్యాచ్ సాగే కొద్దీ బాల్ టర్న్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.