భారత యువ క్రికెట్ జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించింది. గిల్ సారధ్యంలోని కుర్రాళ్ళు 4-1 తేడాతో టీ20 సిరీస్ నెగ్గారు. ఈ సిరీస్ తర్వాత శ్రీలంక టూర్ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. టీ20ల్లో హార్దిక్ పాండ్య దాదాపు ఖరారు కాగా.. వన్డేల్లో రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
శ్రీలంక టూర్ లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్ కు వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ తర్వాత వన్డే, టీ20ల్లో అయ్యర్ పేరును సెలక్టర్లు పట్టించుకోలేదు. బీసీసీఐ మాట లెక్క చేయకపోవడమే దీనికి కారణం.
దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన అయ్యర్ ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించారు. దీంతో ఫామ్ లో ఉన్నప్పటికీ అయ్యర్ కు చోటు దక్కలేదు. అయితే గంభీర్ హెడ్ కోచ్ గా ఎంట్రీ ఇవ్వనుండడంతో ఇప్పుడు అయ్యర్ టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Also Read:-మా దేశానికి రాకపోతే..రాతపూర్వకంగా చెప్పాలె
శ్రీలంక టూర్ నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున గంభీర్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్. ఒకే ఫ్రాంచైజీకి ఆడడంతో ఈ ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. దీంతో గంభీర్ చలవతో అయ్యర్ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గంభీర్ రాక అయ్యర్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. శ్రీలంకతో జరిగే టి20, వన్డే సిరీస్ ల కోసం బీసీసీఐ, సెలెక్టర్లు జూలై 16న జట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.