హెడ్ కోచ్‌గా గంభీర్.. శ్రేయాస్ అయ్యర్‌కు లైన్ క్లియర్..?

హెడ్ కోచ్‌గా గంభీర్.. శ్రేయాస్ అయ్యర్‌కు లైన్ క్లియర్..?

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో స్థానం సంపాదించలేకపోతున్నాడు. వరల్డ్ కప్ తర్వాత వన్డే, టీ20ల్లో అయ్యర్ పేరును సెలక్టర్లు పట్టించుకోలేదు. బీసీసీఐ మాట లెక్క చేయకపోవడమే దీనికి కారణం. దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన అయ్యర్‌ ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించారు.

2024 రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. దీంతో అయ్యర్ టీమిండియాలో చోటు సంపాదించడం కష్టమైపోయింది. అయితే గంభీర్ హెడ్ కోచ్ గా ఎంట్రీ ఇవ్వనుండడంతో ఇప్పుడు అయ్యర్ టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. 

ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల(జూన్) చివరి వారంలో బీసీసీఐ పెద్దలు.. గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇదే అయ్యర్ కు కలిసి రానుంది.

ఐపీఎల్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున గంభీర్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్.ఒకే ఫ్రాంచైజీకి ఆడడంతో ఈ ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. దీంతో గంభీర్ చలవతో అయ్యర్ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ జింబాబ్వే టూర్ కు వెళ్లనుంది. అక్కడ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 

ఈ సిరీస్ తర్వాత జూలైలో శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ 3 వన్డేలు, 3 టీ20 లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచి గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ కు అయ్యర్ ను గంభీర్ టీంలోకి తెస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి గంభీర్ రాక అయ్యర్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.