IND vs ENG, 1st ODI: ఇదెక్కడి ట్విస్ట్.. శ్రేయాస్ అయ్యర్ తొలి వన్డే ప్లేయింగ్ 11లో లేడా..

IND vs ENG, 1st ODI: ఇదెక్కడి ట్విస్ట్.. శ్రేయాస్ అయ్యర్ తొలి వన్డే ప్లేయింగ్ 11లో లేడా..

నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ తో టీమిండియాను ఆదుకున్నాడు. 36 బంతుల్లో 59 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. 

మ్యాచ్ గెలిచిన తర్వాత అయ్యర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తొలి వన్డేలో అసలు తాను  తుది జట్టులో లేనని చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా అయ్యర్ మాట్లాడుతూ.. " తొలి వన్డే ప్లేయింగ్ 11 లో నేను లేనని తెలిసి నైట్ సినిమా చూస్తున్నాను. మరికొంత సేపు నైట్ నిద్ర పోకుండా ఏమైనా చేయాలనుకున్నాను. ఇంతలో రోహిత్ శర్మ నుంచి నాకు కాల్ వచ్చింది. కోహ్లీ 100 శాతం ఫిట్ గా లేడని.. నన్ను మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను వెంటనే నిద్రపోయాను." అని అయ్యర్ మ్యాచ్ తర్వాత ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. 

మోకాలి నొప్పి కారణమా తొలి వన్డేకు కోహ్లీ దూరమైనప్పుడు అతని స్థానంలో జైశ్వాల్ వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ జైశ్వాల్ అంతకముందే తుది జట్టులో ఉన్నాడని అయ్యర్ స్పష్టం చేశాడు. అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని అయ్యర్ వినియోగించుకున్నాడు. మరోవైపు జైశ్వాల్ 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. రెండో వన్డేకు కోహ్లీ వస్తున్న నేపథ్యంలో జైశ్వాల్ బెంచ్ కు పరిమితం కానున్నాడు. తొలి వన్డే విషయానికి వస్తే భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యాన్ని 38.4 ఓవర్లలోనే 251/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.