IND vs AUS: బాగా ఆడినా.. కోహ్లీ దగ్గర నుంచి నేను అది ఆశించను: శ్రేయాస్ అయ్యర్

IND vs AUS: బాగా ఆడినా.. కోహ్లీ దగ్గర నుంచి నేను అది ఆశించను: శ్రేయాస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో నిన్న(ఆదివారం) వన్డేకు ముందు టీమిండియాకు ఎలాంటి సమస్యలు లేకపోయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆసియా కప్ నుంచి భారత జట్టులో కొనసాగుతున్న ఈ ముంబై బ్యాటర్ ఈ  టోర్నీలో ఆడింది ఒక్కటే మ్యాచ్. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా అయ్యర్ మీద సెలక్టర్లు నమ్మకం ఉంచినందుకు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఫిట్ నెస్, ఫామ్.. రెండూ ఒక్కసారే నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అయితే వస్తున్న విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్ తోనే అయ్యర్ సమాధానం చెప్పేసాడు. 

ఇండోర్ లో నిన్న జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడి చేసి 86 బంతుల్లోనే సెంచరీ చేసాడు. విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో తనకు ఇష్టమైన నెంబర్ 3 పొజిషన్ లో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. 105 పరుగులు చేసిన అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సందర్భంగా తనకు సపోర్ట్ గా నిలిచిన కుటుంబానికి, స్నేహితులకి ధన్యావాదాలు తెలిపిన అయ్యర్.. నెంబర్ 3 పొజిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 

"జట్టు కోసం ఎలాంటి స్థానంలో ఆడదానికైనా నేను సిద్ధం. కానీ నెంబర్ 3 స్థానం మాత్రం విరాట్ కోహ్లీదే. అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఆ స్థానానికి విరాట్ సరైనోడు. విరాట్ నుంచి ఆ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు" అని అయ్యర్ తెలిపాడు. మొత్తానికి అయ్యర్ తనకిష్టమైన మూడో స్థానంలో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచులో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో గెలిచింది.