
- మిడిలార్డర్‌లో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్
- స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర
- చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ అయ్యర్‌పై భారీ అంచనాలు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించిన టీమిండియా మూడోసారి విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో మన జట్టు అజేయ జైత్రయాత్రలో పలువురు క్రికెటర్లు ముందున్నారు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెప్పించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ, సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుత ఫిఫ్టీతో ఆకట్టుకున్న కింగ్ విరాట్ కోహ్లీతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండ్ షో చేస్తున్న అక్షర్ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా... గిల్, వరుణ్ చెరోసారి ఈ అవార్డు అందుకున్నారు. అయితే, వీరితోపాటు జట్టు విజయాల్లో మరో వ్యక్తి కీలక పాత్ర ఉంది. అతనే శ్రేయస్ అయ్యర్. సవాల్ విసురుతున్న దుబాయ్ వికెట్లపై ప్రత్యర్థి స్పిన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ మిడిలార్డర్‌లో మన జట్టుకు వెన్నెముకగా మారాడు. టాపార్డర్ తడబడిన ప్రతీసారి నేనున్నానని ముందుకొస్తున్నాడు.
మిడిలార్డర్‌ను మొనగాడిలా నడిపిస్తూ.. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌కు చుక్కానిలా వ్యవహరిస్తున్నాడు. ఓ ఎండ్‌లో అయ్యర్ అందించే అద్భుతమైన సహకారంతోనే విరాట్ కోహ్లీ సహా మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారనడంలో సందేహం లేదు. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 56, 79, 45 స్కోర్లతో ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ప్రస్తుతం జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా మారాడు.
నిలకడగా.. నమ్మకంగా
దుబాయ్‌లోని పిచ్‌లు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి. వికెట్ నుంచి భారీ టర్నింగ్ లేకపోయినా.. స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. స్లో వికెట్లపై స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఆడితే అంత మెరుగైన ఫలితం లభిస్తుందని చెప్పేందుకు శ్రేయస్ అయ్యర్ ఉదాహరణ. ఈ టోర్నీలో స్పిన్ బౌలింగ్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో శ్రేయస్ రెండో స్థానంలో ఉన్నాడు. తను క్రీజులోకి వచ్చే సమయానికే స్పిన్నర్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. బంతి పాత బడుతోంది. ఫీల్డింగ్ విస్తరిస్తోంది. అయినా సరే అతను తొలి బంతి నుంచే ఎంతో ఏకాగ్రత కనబరుస్తున్నాడు. ఓపిగ్గా క్రీజులో నిలిచి.. చెత్త బంతి వచ్చే వరకూ వేచి చూస్తున్నాడు. ఒక్కో ఇటుకా పేర్చి ఇల్లు కట్టినట్టు ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు.
ఒక రకంగా ఈ టోర్నీలో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. . పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి ఛేజింగ్‌ను ముందుకు నడిపించిన అయ్యర్ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత భారీ షాట్లతో ఆటను ఏకపక్షం చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 30/3తో జట్టు కష్టాల్లో పడినప్పుడు కూడా కోహ్లీతో కలిసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్‌లో స్లోయెస్ట్ ఫిఫ్టీ (75 బాల్స్)లో చేశాడు. టోర్నీలో అయ్యర్‌కు ఇప్పటిదాకా సెంచరీ కొట్టకపోయినా.. ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు నెగ్గకపోయినా మిడిలార్డర్‌లో, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతని ఆట జట్టు అత్యంత కీలకంగా మారింది.
ఇప్పుడు గోల్డెన్ ఫేజ్‌లో
ఎంతో ప్రతిభ ఉన్నా.. నిలకడలేమి కారణంగా ఆరంభంలో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన శ్రేయస్ 2019 వరల్డ్ కప్ నుంచి అద్భుతంగా, నిలకడగా ఆడుతున్నాడు. 2019 నుంచి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 2500 అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన ఆరుగురు బ్యాటర్లలో శ్రేయస్ ఒకడు. ఇక, 2022 ఫిబ్రవరి నుంచి అతను గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో గొప్పగా ఆడుతూ మిగతా బ్యాటర్లకు రిస్క్ తగ్గించి వాళ్లు భారీ స్కోర్లు చేయడంలో సాయం చేస్తున్నాడు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ తన మార్కు హిట్టింగ్‌తో ఈ పని చేస్తే.. మిడిల్‌లో అయ్యర్ ఈ బాధ్యత తీసుకుంటున్నాడు.
ఓ ఎండ్‌లో అద్భుత సహకారం అందిస్తూ మిగతా బ్యాటర్ల పని సులువు చేస్తున్నాడు. రోహిత్, అయ్యర్ చూపెట్టే ఇంపాక్ట్‌తో గిల్, కోహ్లీ, రాహుల్ స్వేచ్ఛగా ఆడుతున్నారు. మొత్తానికి శ్రేయస్ అత్యంత నమ్మకమైన, నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకోవడంతో ఇండియా టాప్–5 బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా మారింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే ఫైనల్లోనూ శ్రేయస్ ఇదే నిలకడను చూపెట్టి జట్టును గెలిపించేందుకు కృషి చేయాలని ఆశిస్తున్నాడు. ఇకపైనా ఇదే జోరును కొనసాగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ పేరు గడిస్తాడనడంలో సందేహం లేదు.