కరోనా కారణంగా ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. పది రోజుల కిందట లండన్ నుంచి వచ్చిన శ్రుతీహాసన్‌కి ఎయిర్‌పోర్టులో స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండమంటూ ఆమె చేతిపై స్టాంప్ వేశారు. దీంతో పది రోజులుగా హోమ్ క్వారంటైన్‌లో ఉంటోంది శ్రుతి. అలా అని రెస్ట్ తీసుకోవడం లేదు. ఓ ఇంటరెస్టింగ్ పని చేస్తోంది. దానిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సెల్ఫ్ క్వారంటైన్ తనకేమీ కొత్త కాదని, వీలైనంత వరకు తాను ఒంటరిగానే గడుపుతుంటానని చెప్పిన శ్రుతి.. ఈ పది రోజులు ఇట్టే గడిచిపోయాయంది. ఈ పది రోజులూ ఇంట్లో వంట చేయడంతో పాటు కొన్ని బేకింగ్ ఐటెమ్స్ కూడా చేసిందట. అంతేకాదు.. స్వయంగా ఆర్గానిక్ సబ్బులు తయారు చేసిందట. పని మనిషిని కూడా మాన్పించేసి అన్ని పనులూ తానే చేసుకుంటున్నానని, అసలు బోర్ కొట్టే ప్రసక్తే లేదని, తనలాగే అందరూ ఇంట్లో ప్రశాంతంగా ఉంటే కరోనాని కంట్రోల్ చేయవచ్చని చెప్పింది. వివిధ పనుల మీద, వివిధ దేశాలకు వెళ్లిన తన కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉన్నారట. ప్రస్తుతం తామంతా ఒకర్నొకరు కలుసుకోవడం లేదని, వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నామని చెప్పుకొచ్చింది. బయట జరిగేదానితో పోలిస్తే క్వారంటైన్‌లో ఉండటం చాలా సేఫ్ అంటోంది శ్రుతి. నిజమేగా మరి!
For More News..