రాంచీ : ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయానని టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అది కాస్త నిరాశ కలిగించిందని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గా ఆడిన గిల్‌ను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సిరీస్‌కు ముందు 9 ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్ట్‌ల్లో 42 యావరేజ్‌తో 252 రన్స్ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు.
విశాఖలో 104, రాజ్‌కోట్‌లో 91 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. తన బ్యాటింగ్‌లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేసుకోకుండానే కాన్ఫిడెన్స్‌ను పెంచుకుంటూ ఫామ్‌లోకి వచ్చానని గిల్ చెప్పాడు. ‘అంచనాలకు అనుగుణంగా జీవించడం చాలా కష్టం. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు నాకు పెద్దగా తేడా అనిపించలేదు. కానీ నా వరకు వచ్చేసరికి విషయం అర్థమైంది. ఈ సిరీస్‌కు ముందు నాపై పెట్టుకున్న అంచనాలను అందుకోకపోవడం నన్ను నిరాశపరిచింది.
దేశం, టీమ్ కోసం ఆడుతున్నప్పుడు మనపై కచ్చితంగా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే, కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలైనా నా మైండ్‌సెట్‌లో మార్పు రాలేదు. నాపై అంచనాలు ఎప్పుడూ ఉంటాయని తెలుసు. అందుకే వాటిని సర్దుబాటు చేయడం నేర్చుకున్నా. వైఫల్యాలను త్వరగా మర్చిపోయి ముందుకు సాగాలి. తర్వాతి చాలెంజ్‌కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే పెద్ద ప్లేయర్, సగటు ఆటగాడికి మధ్య తేడా’ అని గిల్ పేర్కొన్నాడు.
మూడో నంబర్‌లో కష్టం..
మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం చాలా భిన్నంగా ఉంటుందని గిల్ వెల్లడించాడు. ‘ఇంతకుముందు ఇండియా–ఎ, రంజీ మ్యాచ్‌ల్లో 3,4 స్థానాల్లో బ్యాటింగ్ చేశా. ఓపెనర్‌గా ఆడేటప్పుడు పెద్దగా ఆలోచించే అవసరం లేకపోయేది. టాస్ తర్వాత వెంటనే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి ఉండటంతో ఆలోచించడానికి టైమ్ కూడా దొరకదు. అదే 3, 4వ ప్లేస్‌లో అయితే పరిస్థితులకు తగినట్లుగా ఆడాలి. స్టార్టింగ్‌లోనే రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను సెట్ చేయాలి. వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లే ఇందుకు ఉదాహరణ’ అని చెప్పుకొచ్చాడు.
యంగ్‌స్టర్స్‌కు మంచి అవకాశం
ఈ సిరీస్‌లో పిచ్‌లు తమకు అనుకూలంగా లేకపోయినా కీలక పరిస్థితుల్లో టీమిండియా పేసర్లు ఆటను మార్చేశారని గిల్ చెప్పాడు. ‘సిరీస్‌లో నలుగురు స్పిన్నర్లు కలిసి 36 వికెట్లు తీస్తే పేసర్లు 22 పడగొట్టారు. కానీ పేసర్ల వల్లే టీమ్ ముందంజలో ఉంది. ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. అశ్విన్, జడేజా ఎక్కడైనా వికెట్లు తీయగలరు. కానీ ఈ సిరీస్‌లో మా పేసర్లు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. కోహ్లీ, బుమ్రా గైర్హాజరీలో సత్తాను నిరూపించుకోవడానికి యంగ్‌స్టర్స్‌కు ఇదో మంచి అవకాశం’ అని గిల్ పేర్కొన్నాడు.