
- 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం
- రాణించిన షమీ, హర్షిత్, రోహిత్..తౌహిద్ సెంచరీ వృథా
దుబాయ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా.. చాంపియన్స్ ట్రోఫీలో బోణీ చేసింది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ (5/53), బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (129 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–ఎ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 రన్స్‌కు ఆలౌటైంది.
తౌహిద్ హ్రిదోయ్ (118 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100), జాకెర్ అలీ (68) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత ఇండియా 46.3 ఓవర్లలో 231/4 స్కోరు చేసింది. రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) రాణించారు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.
35/5.. క్యాచ్‌లు జారవిడిచిన ఫీల్డర్లు
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను బౌలర్లు కట్టడి చేసినా ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే షమీ.. సౌమ్య సర్కార్ (0)ను ఔట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అక్షర్ పటేల్ (2/43), హర్షిత్ రాణా (3/31) తొమ్మిది ఓవర్లు ముగియకముందే తన్జిద్ హసన్ (25), నజ్ముల్ షాంటో (0), మెహిదీ హసన్ మిరాజ్ (5), ముష్ఫికర్ (0)ను పెవిలియన్‌కు పంపడంతో బంగ్లా 35/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మధ్యలో అక్షర్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. ఓ ఎండ్‌లో నిలకడగా ఆడిన తౌహిద్‌కు జాకెర్ అలీ అండగా నిలిచాడు. సింగిల్స్, డబుల్స్‌తో కుదురుకున్న ఈ ఇద్దరు క్రమంగా బ్యాట్లు ఝుళిపించారు. దీంతో 34.3 ఓవర్లు క్రీజులో నిలిచిన ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 154 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 43వ ఓవర్‌లో జాకెర్ ఔట్‌తో మళ్లీ చకచకా వికెట్లు పడినా తౌహిద్ సెంచరీతో మంచి స్కోరు అందించాడు. రిషాద్ హోసేన్ (18), తౌహిద్‌తో ఏడో వికెట్‌కు 25 రన్స్ జోడించి ఔట్‌కాగా, తన్జిమ్ హసన్ షకీబ్ (0), టస్కిన్ అహ్మద్ (3), ముస్తాఫిజుర్ (0 నాటౌట్) నిరాశపర్చారు.
గిల్ నిలకడ..
ఛేజింగ్‌లో ఇండియా ఇన్నింగ్స్‌కు గిల్ వెన్నెముకగా నిలిచాడు. రోహిత్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగినా.. 10వ ఓవర్‌లో టస్కిన్ (1/36) వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌కు భారీ షాట్ ఆడి రిషాద్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో స్కోరు 69/1గా మారింది. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ (22) మళ్లీ ఫెయిలయ్యాడు. 23వ ఓవర్‌లో రిషాద్ వేసిన లెగ్‌సైడ్ బాల్‌ను ఫ్లిక్ చేసి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో సౌమ్య చేతికి చిక్కాడు. 28వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ (15) కూడా ముస్తాఫిజుర్ వేసిన ఆఫ్ కట్టర్ బాల్‌ను షాట్ ఆడి మిడాఫ్‌లో నజ్ముల్‌కు దొరికాడు.
ఈ మధ్యలో గిల్ 69 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేయగా, 31వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (8).. రిషాద్‌కు రిటర్న్ క్యాచ్ వెనుదిరిగాడు. దీంతో ఇండియా 144/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన రాహుల్.. గిల్‌కు అండగా నిలిచాడు. డిఫెన్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బాల్‌ను బౌండ్రీ దాటించి ఒత్తిడి లేకుండా చేశాడు. రెండో ఎండ్‌లో స్వేచ్ఛగా ఆడిన గిల్ 125 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. గిల్‌తో ఐదో వికెట్‌కు 87 రన్స్ జత చేసిన రాహుల్ చివర్లో భారీ సిక్స్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 49.4 ఓవర్లలో 228 ఆలౌట్ (తౌహిద్ హ్రిదోయ్ 100, జాకెర్ అలీ 68, షమీ 5/53). ఇండియా: 46.3 ఓవర్లలో 231/4 (గిల్ 101*, రాహుల్ 41* రిషాద్ 2/38). అక్షర్ హ్యాట్రిక్ మిస్.. రోహిత్ ‘సారీ’
చాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించే సువర్ణ అవకాశం తన వల్ల చేజారినందుకు కెప్టెన్ రోహిత్.. స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు సారీ చెప్పాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో అక్షర్ వేసిన రెండు, మూడో బాల్స్‌కు వరుసగా తన్జిద్ హసన్, ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌లను కీపర్ రాహుల్ ఈజీగా అందుకున్నాడు.
ఇక నాలుగో బాల్ జాకెర్ అలీ బ్యాట్‌కు తాకి స్లిప్‌లోకి వెళ్లింది. కానీ అక్కడే ఉన్న రోహిత్ దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. దీనికి తీవ్రంగా వేదన చెందిన హిట్‌మ్యాన్ చేతిని నేలకు బలంగా కొట్టి ఆ తర్వాత సారీ చెబుతూ సైగ చేశాడు.
1ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షమీ బంతుల పరంగా (5126) అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. స్టార్క్ (5240) రెండో ప్లేస్‌కు పడిపోయాడు. మ్యాచ్‌ల పరంగా స్టార్క్ (102), షమీ (104) తొలి రెండు ప్లేస్‌ల్లో ఉన్నారు. ఇండియా తరఫున వేగంగా 200 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్ షమీ. అగార్కర్ (133 మ్యాచ్‌లు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇండియా తరఫున మొత్తం ఎనిమిది మంది 200 క్లబ్‌లో ఉన్నారు.
1వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్లలో అత్యధిక వికెట్లు (60) తీసిన తొలి ఇండియన్ బౌలర్ షమీ. జహీర్ (59), శ్రీనాథ్ (47), జడేజా (43) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
2 చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ షమీ (5/53). జడేజా (5/36) ముందున్నాడు.
2 వన్డేల్లో ఫాస్ట్‌గా 11 వేల రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్ రోహిత్ (261 ఇన్నింగ్స్). కోహ్లీ (222 ) ముందున్నాడు. సచిన్ (276), పాంటింగ్ (286), గంగూలీ (288) తర్వాతి ప్లేస్‌ల్లో ఉన్నారు.