Virat Kohli: గిల్‌పై తీవ్ర విమర్శలు.. కలకలం రేపుతోన్న కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో

Virat Kohli: గిల్‌పై తీవ్ర విమర్శలు.. కలకలం రేపుతోన్న కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఎన్ని లాభాలున్నాయో తెలియదు కానీ, నష్టాలు మాత్రం కళ్లముంగిట దర్శనమిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు కృత్రిమ మేధ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సాయంతో ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఏఐ సాంకేతికతపై విమర్శలకు దారి తీసిన రష్మిక మంధాన మార్పింగ్ వీడియో కంటే.. ఈ వీడియో మరింత అగ్గి రాజేసేలా ఉంది. 

ఏఐ టెక్నాలజీ సాయంతో కోహ్లీ అనని మాటలు అన్నట్లు వీడియోను రూపొందించి వైరల్ చేశారు. అందులో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి కోహ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఒకవైపు గిల్ టెక్నిక్ అద్భుతం అని పొగిడిన కోహ్లీ.. మరోవైపు అతనికి ఆటే రాదన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధించాడు. 

వీడియోలో ఏముందంటే..?

ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చాక మరింత రాణించడానికి ఏం చేయాలో.. ఎలా సక్సెస్ అవ్వాలో నేను గుర్తించాను. శుభ్‌మన్ గిల్‌ను నేను చాలా దగ్గరగా చూశాను. అతను నైపుణ్యం కలిగిన ఆటగాడే. అందులో సందేహం లేదు. కానీ అతను భవిష్యత్తు ఆటగాడిగా ఎదిగేందుకు.. దిగ్గజ ఆటగాడిగా మారేందుకు చాలా తేడా ఉంది. అతని టెక్నిక్ అద్భుతం. కానీ ఆ ఆటతో మమ్మల్ని ఎప్పటికీ చేరుకోలేడు. ఆట చూసి అభిమానులు అతన్ని మరో విరాట్ కోహ్లీ అవుతాడని ప్రశంసించొచ్చు.. కానీ అతను ఎప్పటికీ మరో కోహ్లీ కాలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పటికీ ఒక్కడే.

నేను కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది కఠినమైన బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న.. నిలకడగా రాణించా. భారత్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే బెంచ్ మార్క్ సెట్ చేశారు. గిల్ ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది..' అని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినట్లుగా ఈ వీడియోను రూపొందించారు.

ఈ వీడియో చూశాక 'ఏఐతో జాగ్రత్తగా ఉండాలి..!' అని కొందరు అంటుంటే.. మున్ముందు ఎవరెవరి వీడియోలు చూడాల్సి వస్తుందో అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.