India vs Bangladesh 2024: బుమ్రాకు షాక్ .. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా గిల్..?

India vs Bangladesh 2024: బుమ్రాకు షాక్ .. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా గిల్..?

టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ ను అన్ని ఫార్మాట్ లలో వైస్ కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ ఈ యువ అతడిని భవిష్యత్ కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం జరగబోయే శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ కు గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. టెస్టుల్లో మాత్రం బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉంటున్నాడు. అయితే నివేదికల ప్రకారం గిల్ కు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందట. 

బంగ్లాదేశ్‌తో స్వదేశంలో భారత్ సెప్టెంబర్ నెలలో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. సెలెక్టర్లు జట్టును ప్రకటించినప్పుడు బుమ్రా స్థానంలో గిల్ కొత్త వైస్ కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు సెప్టెంబర్ 19న చెన్నైలో.. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్టు జరగనున్నాయి. 

ప్రస్తుతం టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. ఇటీవలే అంతర్జాతీయ టీ20 లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో టీ20 కెప్టెన్ గా సూర్యను సెలక్ట్ చేశారు. మూడు ఫార్మాట్ లలో గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగితే.. భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-25) ​​పాయింట్ల పట్టికలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 

రెండేళ్ల నుంచి గిల్ నిలకడగా ఆడుతూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. దీంతో అతన్ని ఇటీవలే ముగిసిన జింబాబ్వే టూర్ కు యువ భారత జట్టుకు కెప్టెన్ గా ప్రకటించారు. ఈ సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలిచింది.