Shubman Gill: ఆటలోనే కాదు వ్యక్తిగతంలోనూ టాప్.. గిల్‌పై నెటిజన్స్ ప్రశంసలు

సెలెబ్రిటీల జీవితం చాలా బిజీగా ఉంటుంది. కొన్నిసార్లు సహచర ఆటగాళ్లను పట్టించుకునే సమయం కూడా ఉండదు. కానీ కొద్ది మంది మాత్రమే తమ ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఈ లిస్టులోకి గిల్ కూడా చేరిపోయాడు. ఇంగ్లండ్‌తో రాంచీలో నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత ఎయిర్ పోర్ట్ దగ్గర గిల్ బుధవారం (ఫిబ్రవరి 28) రాబిన్ మింజ్ తండ్రిని కలిసి అతనితో మాట్లాడాడు. రాంచీకి చెందిన రాబిన్ మింజ్ గుజరాత్ టైటాన్స్ తరపున 2024 సీజన్ లో తొలిసారి ఆడనున్నాడు. 

రాబిన్ తండ్రి రాంచీ ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. గిల్ అతనితో నడుచుకున్న తీరుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా సాధారణ వ్యక్తిగా అతనితో చాలా సేపు మాట్లాడుతూ.. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతనితో ఒక సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. రాబిన్ మింజ్ తండ్రిని కలవడం గౌరవంగా ఉందని.. మీ ప్రయాణం, కృషి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపాడు. గిల్ గత రెండు సీజన్ ల నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హార్దిక్ పాండ్యను ముంబై కొనుగోలు చేయడంతో 2024 ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

రాబిన్ మింజ్ పేరు క్రికెట్ లో పెద్దగా పరిచయం లేదు. అయితే ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చి ఏకంగా 3.6 కోట్ల ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ యువ ఆటగాడి కోసం పోటీ పడగా.. చివరికి గుజరాత్​ అతడ్ని సొంతం చేసుకుంది. కీపింగ్, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల ఈ టాలెంటెడ్ ఆల్ రౌండర్ ను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించారు. గుజరాత్ మింజ్ రూ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది. 

క్లబ్ క్రికెట్, అండర్​-19, అండర్-25 టోర్నమెంట్స్​లో జార్ఖండ్ తరఫున అద్భుతంగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లబ్ క్రికెట్​లో రాబిన్ 140కు పైగా స్ట్రైక్ రేట్​తో చెలరేగి ఆడటం విశేషం. ఈ క్రమంలో డొమెస్టిక్ టీ20 క్రికెట్​లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటాడు. ఒడిశాలో జరిగిన ఒక టీ20 టోర్నమెంట్​లో కేవలం 35 బంతుల్లోనే 75 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు.