ZIM v IND 2024: యువకులతో జింబాబ్వే టూర్.. టీమిండియా కెప్టెన్‌గా గిల్

ZIM v IND 2024: యువకులతో జింబాబ్వే టూర్.. టీమిండియా కెప్టెన్‌గా గిల్

టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు లభించని శుభమన్ గిల్ కు బంపరాఫర్ తగలనుంది. ఈ యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతూ బిజీగా ఉంది. ఈ మెగా లీగ్ తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఈ టూర్ కు స్టార్ ఆటగాళ్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. ఐపీఎల్ లో సత్తా చాటిన యువ క్రికెటర్లకు ఈ టూర్ లో ఛాన్స్ ఇవ్వనున్నారు. 

కుర్రాళ్లతో నిండిన ఈ జట్టుకు  గిల్ ను కెప్టెన్ గా చేయడం దాదాపు ఖరారైంది. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య రెస్ట్ కావాలని అడగడంతో బీసీసీఐ గిల్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం గిల్ కు ఉంది. ఈ సీజన్ లో జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడంలో విఫలమైనా.. అతని కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్తు కెప్టెన్ గా కితాబులందుకుంటున్న శుభమాన్.. ఈ సిరీస్ లో రాణిస్తే తిరుగుండదు. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. 

మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6,7,10,13,14 తేదీల్లో జరుగుతాయి. ఐపీఎల్ సీజన్ 2024 లో అదరగొట్టిన టీమిండియా యువ క్రికెటర్లకు సెలక్టర్లు జాతీయ జట్టులో స్థానం కల్పించనున్నారు. ఏకంగా 7 గురు ఆటగాళ్లు ఈ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ దయాల్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరితో పాటు వెంకటేష్ అయ్యర్ జట్టులో చేరడం దాదాపుగా ఖాయమైంది.             

8 ఏళ్ల తర్వాత జింబాబ్వేలో భారత్‌ పర్యటించడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన క్రికెట్ జట్టు.. రెండు సార్లు సిరీస్ గెలిచింది. 2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్ లాడగా.. 5 టీ20ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20 ల్లో ఓటమి పాలైంది.