దైవం ముందు అందరూ సమానులే, మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేసిన రామానుజాచార్యుల కీర్తి మళ్లీ దశదిశలా వ్యాపించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్, మైహోం రామేశ్వరరావు అనే ముగ్గురు శూద్రులు కలిసి రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. చైనాలోని బౌద్ధులు విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు బౌద్ధులు, శూద్రులు కలిసి ఇప్పుడు ఆ విగ్రహాన్ని నిలబెడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామానుజాచార్యులను ప్రశంసించిన విధంగానే గద్దర్ కూడా ఆయన తత్వంపై చక్కని పాటను అందించారు. చిన్నజీయర్ లాంటి వారు నిజమైన సమత, మమత, సమానత్వం ఆచరించే దిశగా అడుగులు వేయాలి. అలా ఎదిగితే పోయేదేమీ లేదు.. అఖండమైన కీర్తి రావడం తప్ప. అందువల్ల ప్రభుత్వాలు కూడా సమానత్వానికి ఆచరణలో పెద్దపీట వేయాలి. ఈ దిశగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ తదితరులు పూనుకున్నప్పుడే నిజమైన సమతామూర్తిగా రామానుజుడి పునఃప్రతిష్ఠ సార్థకం అవుతుంది.
ముచ్చింతల్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలె
రామానుజుని విగ్రహం కన్నా ఎంతో ముందు ప్రారంభించిన నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. అనేక బౌద్ధ తాత్వికులను నెలకొల్పుతున్నట్టుగానే ముచ్చింతల్‌లో రామానుజుల శిష్య పరంపర విగ్రహాలను చుట్టూరా ఏర్పాటు చేయాలి. కబీర్ దాస్, గురు రవి దాస్ వంటి 12 మంది శిష్యులు, వారి గురువైన రామానందుడు, రామానందుని గురువైన రాఘవానంద విగ్రహాలను నెలకొల్పాలి. రామానుజుడు ఎంతో గొప్ప సేవ చేసారని కీర్తించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సమున్నతంగా ముచ్చింతల్ రామానుజాచార్య ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ తండ్రి రాంజీ కబీర్ పంథీయుడు. కనుక ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పి గౌరవించాలి.
రాచరికాల కాలంలో ప్రజాస్వామ్య సమానత్వం గురించి చెప్పేందుకు అవకాశం లేనందున సామాజిక సమానత్వానికి సంబంధించి దైవం ముందు అందరూ సమానులే, మానవ సేవే మాధవ సేవ అని భక్త కవులు ప్రచారం చేశారు. వీర శైవం, శ్రమయే దైవం అని శూద్రులను, ఉత్పత్తి కులాలను గౌరవించారు. ఆ కోవలోకి చెందిన కొంతమంది భక్తాగ్రేసరుల్లో ఒక్కడైన రామానుజాచార్య కీర్తి మళ్లీ పునఃవైభవాన్ని పొందనుంది. 1134–1196 కాలంలో కర్నాటకకు చెందిన బసవేశ్వరుడు సహపంక్తి భోజనాలను వ్యాప్తి చేసి అందరూ సమానమే అని చాటారు. ఆయన కంటే కాస్త ముందుకాలం అంటే 1017–1137 కాలంలో తమిళ ప్రాంతానికి చెందిన రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు ప్రచారం చేశారు.
తాను నరకానికి పోయినా ఫర్లేదని..
రామానుజుని కాలం నాటికే పల్లవులు కట్టించిన మహాబలిపురం, కంచి వంటివి సుప్రసిద్ధం. చోళుల కాలంలో జీవించిన రామానుజుడు అప్పటి సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయి ఉన్న కుల భేదాలను నిరసించారు. దైవం ముందు అందరూ సమానులే అన్నారు. ఆనాడు రాజ్య అవసరాలు కూడా ఆలోచించి చోళులు, చాళుక్యుల మధ్య వివాహ సంబంధాలు నెరుపుకుంటూ వచ్చారు. మరోవైపు జైనం, శైవం కన్నా బలీయంగా ప్రజలను తమ వైపు ఆకర్షించాలని, అప్పుడే ముందుకు వస్తున్న ఇస్లాం సమానత్వ భావాలు, సర్వేశ్వరుడొక్కడే అనే భావన ఎందరినో ఆలోచింపజేశాయి. అప్పటి వరకు కరడు గట్టుకుపోయిన కుల వివక్ష, హెచ్చుతగ్గులు సరైనవి కావని భావించి.. ప్రజలను దైవం చెంత ఒకటి చేయాలని రామానుజుడు భావించారు. ఎవరికీ చెప్పకు రహస్యం అంటూ చెప్పిన నారాయణ మంత్రాన్ని.. నేను నరకానికి పోయినా ఫరవాలేదని కంచి గుడి గోపురం ఎక్కి అందరికీ ఉపదేశించిన మానవతా వాది రామానుజం.
కాలక్రమంలో పెరిగిపోయిన కులాలు
శతాబ్దాల పాటు జైనం, బౌద్ధం, శైవం, వీర శైవం, వైష్ణవం, వీరవైష్ణవం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఇస్లాం మధ్య సంఘర్షణలు, భౌతిక దాడులు, భౌతిక నిర్మూలన సాగినట్టు చరిత్ర, సాహిత్య ఆధారాలు తెలుపుతున్నాయి. రాజుల ప్రాపకం, ప్రాభవం, రాజ్య విస్తరణ బ్రాహ్మణ కులాధిక్యత, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనే భౌతిక ప్రాతిపదికలపై ఇవి కొనసాగుతూ వచ్చాయి. కులాలను ఒక్కటి చేయాలని ఎంత ప్రయత్నించినా, ఆయా భక్తి ఉద్యమాల ఊపు తగ్గగానే ఆయా కుల వృత్తుల వారీగా జనం విడిపోయారు. పైగా ఆ తర్వాత ఒకే వృత్తిలో శైవ కులాలు, వైష్ణవ కులాలు అంటూ అనేక రెట్లు పెరిగాయి. ఆనాటి శాసనాల్లో, సాహిత్యంలో కొన్ని కులాలనే పేర్కొన్నారు. ఇలా శతాబ్దాల సహజీవనంలో అనేక భావాలు, సంస్కృతులు మతాలుగా, ఒకే మతంలో అనేక శాఖలుగా విస్తరించి కలగలిసి పోయాయి. తర్వాత ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో కూడా చేరిపోయాయి.
రాజ్యాంగం తాత్వికత ఏమిటి?
భారత రాజ్యాంగం తాత్విక పునాది ఏమిటనే ప్రశ్నకు సర్వేపల్లి రాధాకృష్ణ రాజ్యాంగం తాత్వికత అద్వైతం అన్నారు. అదొక్కటే కాదు వీరశైవం, బౌద్ధం, శైవం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, జైనం, ఇస్లాం భారతీయ తాత్విక భావాలు శాస్త్రాల సంస్కృతులు, ఆదివాసీ గణతెగలు, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం మన రాజ్యాంగంలో గమనించవచ్చు. వ్యక్తికి, సమాజానికి మధ్య సంబంధాన్ని వర్గాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు, కేంద్రానికి, సామాజిక వర్గాల మధ్య గల సంబంధాలను బౌద్ధం, శైవం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అనే తాత్విక పునాదుల నేపథ్యంలో తమకు తెలియకుండానే రాజ్యాంగ వేత్తలు, రాజ్యాంగ నిర్మాతలు అనుసరించారు. ఆచరించారు. ఆదివాసీ గిరిజనులకు, ఈశాన్య భారత ప్రాంతాలకు గల ప్రత్యేక హక్కులు మొదలైనవి చరిత్ర పరిణామంలో చేర్చినవే. రాజ్యాంగ నిర్మాతల్లో ఆ భావాలు ఉండడం వల్ల సహజంగానే వారి వారి అవగాహన రాజ్యాంగంలో చొప్పించారు. అందరూ సమానమే అన్న భావన గొప్ప భావనకు ప్రతీక. ప్రతి ఒక్కరికీ ఒకే విలువ ఒకే ఓటు అనేది ఒక మహత్తర మానవతా సమానత. అదే సమయంలో వెనుకబడిన వారిని సమానంగా పైకి తీసుకురావడానికి 14, 15, 16 ఆర్టికల్స్‌ను ప్రత్యేకంగా పొందుపరిచారు. అలాగే మహిళా సమానత్వాన్ని, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి పేర్కొన్నారు. గోవధ నిషేధం కూడా రాజ్యాంగంలో భాగంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో.. కేంద్రం అద్వైతాన్ని కోరగా, రాష్ట్రాలు ద్వైతాన్ని కోరుతాయి.
అర్చకులుగా అందరికీ అవకాశం కల్పించాలి
రామానుజాచార్య అంటరానితనాన్ని, కుల వివక్షను వ్యతిరేకించిన ఆచరణను ముందుకు తీసుకుపోవాలి. అందుకు వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా అంటరానివారికి, శూద్రులకు, బీసీలకు శిక్షణ ఇచ్చి నియమించడం అవసరం. తిరుపతి, యాదాద్రి, ముచ్చింతల్ రామానుజాచార్య తదితర అన్ని ఆలయాల్లో సగం మంది బీసీ, ఎస్సీలను అర్చకులుగా నియమించాలి. అపుడే రామానుజాచార్య లక్ష్యం నెరవేరుతుంది. కాలక్రమంలో విశిష్టాద్వైతంలో అనేక మలుపులు వచ్చాయి. విగ్రహ పూజ, క్షేత్ర ప్రాధాన్యతను, దేవాలయాలను గొప్ప చేసేవారు కొందరైతే.. అవి ముఖ్యం కాదని మానవ సేవే మాధవ సేవ అని ప్రజలకు ప్రబోధించిన వారు భక్త కబీర్, గురు రవిదాస్ తదితరులు.
బీఎస్ రాములు
సామాజిక తత్వవేత్త