- ఒకే కుటుంబంలో రెండేసి చొప్పున కేటాయింపు
- జాబితాలో స్ట్రీట్ వెండర్ కార్డుల్లేని ఆరుగురి పేర్లు
- లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
- 52 మందితో రిలీజ్ అయిన జాబితా వివాదాస్పదం
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ వెంట నిర్మించిన షట్టర్లను అనర్హులకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనే ఈ షట్టర్ల కేటాయింపు వ్యవహారం హైకోర్టుకు చేరగా.. తాజాగా 52 మంది పేర్లతో రూపొందించిన లబ్ధిదారుల జాబితా వివాదాస్పదంగా మారింది. ఈ జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని, స్ట్రీట్ వెండర్లుగా నమోదు కాకుండా బయట షాపులు నిర్వహించే వ్యాపారులు, వారి కుటుంబసభ్యుల పేర్లు ఇందులో చేర్చినట్లు తెలిసింది. శనివారం నిర్వహించిన బల్దియా సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా కాపీతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
లబ్ధిదారుల పేర్లతో రెండు జాబితాలు..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రహరీకి ఆనుకుని రేకుల కప్పుతో 126 షటర్లు, శాతవాహన వర్సిటీ ఏరియాలో మరో 25 షటర్లు నిర్మించారు. ఈ షాపులను కేటాయించేందుకు మార్చిలో రూ.1000 డీడీతో అప్లికేషన్లు స్వీకరించగా.. సివిల్ హాస్పిటల్ ఏరియా షట్టర్ల కోసం 797, యూనివర్సిటీలోని షట్టర్ల కోసం 295, మొత్తంగా 1092 అప్లికేషన్లు వచ్చాయి.
సివిల్ హాస్పిటల్ ఏరియాలోని 126 షట్టర్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 19 షాపులు, ఎస్టీలకు 8 షాపులు, దివ్యాంగులకు 4 షాపులు, నాయీబ్రాహ్మణులు, వాషర్ మన్ కోఆపరేటివ్ సొసైటీలకు 6 షాపులు, మహిళా సంఘాల సభ్యులకు 13 షాపులు కేటాయించనున్నట్లు నోటిఫికేషన్ లో బల్దియా పేర్కొంది.
కాగా రాజకీయ పలుకుబడితో స్ట్రీట్ వెండర్లు కానివారికి షట్టర్లు కేటాయించాలని చూస్తున్నారని ఆరోపిస్తూ 75 మంది హైకోర్టును ఆశ్రయించగా అర్హులకే కేటాయించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బల్దియా ఆఫీసర్లు మరోసారి సర్వే చేసి సివిల్ హాస్పిటల్ వద్ద ఉన్న షట్లర్లు కేటాయించేందుకు 39 మందితో జాబితాను రూపొందించారు. దరఖాస్తుల పున: పరిశీలన క్రమంలో మరో 13 మందితో రెండో జాబితాను కూడా సిద్ధం చేశారు.
జాబితాల్లో అనర్హుల పేర్లు
52 మందితో రూపొందించిన రెండు జాబితాల్లోనూ కొందరు అనర్హుల పేర్లను చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి జాబితాలో ఇద్దరు అన్నదమ్ముళ్లకు రెండు షట్టర్లు, మరో ఇద్దరు అన్నదమ్ముళ్లకు మరో రెండు షట్టర్లను కేటాయించినట్లు తెలిసింది. ఫస్ట్ జాబితాలో అన్న పేరు వద్ద బీసీ- బీగా పేర్కొని, రెండో జాబితాలో అతడి తమ్ముడిని ఎస్సీగా పేర్కొనడం గమనార్హం. అలాగే భార్య పేరిట ఒకటి, భర్త పేరిట మరో షట్టర్ కూడా కేటాయించడం వివాదాస్పదంగా మారింది. షట్టర్లు పొందాలంటే తప్పనిసరిగా స్ట్రీడ్ వెండర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. కానీ బల్దియా రూపొందించిన ఫస్ట్ జాబితాలో ఇద్దరికి, రెండో జాబితాలో నలుగురికి స్ట్రీట్ వెండర్ నంబర్ లేకపోవడం గమనార్హం.
అంతేగాక బయట పేరొందిన ఇద్దరు పాన్ షాపు ఓనర్లకు కూడా ఇందులో షట్టర్లు కేటాయించారు. ఇదిలా ఉండగా 39 మంది జాబితాలో క్రమసంఖ్య 4, 5(గూడెల్లి పుష్పలత, గూడెల్లి నారాయణ), 7, 15(పోదిళ్ల నారాయణ, పొదిళ్ల సునీత) లబ్ధిదారులు ఒకే కుటుంబానికి చెందినవారుగా ఉన్నారని, క్రమసంఖ్య 25(కొట్టేపల్లి లావణ్య) జాబితాలో లేదని, అర్జీ కూడా సమర్పించలేదని సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. రెండు జాబితాల్లోని 52 మంది లబ్ధిదారులకు షట్టర్ నంబర్లు కేటాయించేందుకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో మిగతా 74 షట్టర్లకు లబ్ధిదారుల ఎంపికకు డ్రా తీయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఏరియాలోని 25 షట్టర్ల కేటాయింపుపై ఇంకా ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు.
రిజర్వాయర్ పైప్ లైన్‌కు రిపేర్
కరీంనగర్, వెలుగు: భగత్ నగర్ మంచినీటి రిజర్వాయర్ ప్రధాన హెచ్‌డీపీఏ పైపులైన్ 5 రోజుల కింద పగిలిపోగా రిపేర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం రిపేర్ పనులను మేయర్ సునీల్ రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
కొత్త గనులు వస్తేనే మనుగడ
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కొత్త గనులు వస్తేనే సంస్థకు మనుగడ ఉంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని యూనియన్ ఆఫీస్‌లో జరిగిన ఆర్జీ 1 ఏరియా కమిటీ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే ఇతర కార్మిక సంఘాలు ఓర్వడం లేదన్నారు. టీబీజీకేఎస్ చెందిన దోరగండ్ల మల్లయ్య, సమ్మయ్య, మిడివెల్లి రవీందర్, ఏఐటీయూసీలో చేరారు. ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి పోషం, లీడర్లు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ మృతి
గంగాధర, వెలుగు: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ఇరుగురాల హన్మవ్వ (85) ఆదివారం చనిపోయారు. హన్మవ్వ 1996 నుంచి 2001 వరకు ఐదేళ్లపాటు సర్వారెడ్డిపల్లికి తొలి మహిళా
సర్పంచ్‌గా పనిచేశారు.