- నార్మల్ డెలివరీలు ఎందుకు తగ్గుతున్నయ్?
- రక్తహీనత, పౌష్టికాహార లోపాలు సాకుగా చూపొద్దు
- కారణాలు కనుక్కొని పరిష్కార మార్గాలు చూడండి
- కంటి సమస్యలున్న విద్యార్థులకు అద్దాలివ్వండి
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి
నాగర్ కర్నూల్ టౌన్/ అచ్చంపేట/ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రభుత్వం ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు, డాక్టర్లను ప్రశ్నించారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం కారణంగా చూపి సీజేరియన్‌కు రెఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. ముందుగా అచ్చంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అనంతరం అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రోగ్రాం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 8,9,10వ తరగతి విద్యార్థుల కంటి సమస్యలపై ఆరా తీయగా.. స్కూళ్లలో పరీక్షలు నిర్వహించి 40 మందిని గుర్తించామని ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ చెప్పారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె సమస్య గుర్తించి వదిలేయడం కాదని, వెంటనే అద్దాలు ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనతకు గల కారణాలు గుర్తించి పరిష్కార మార్గాలు చూడాలన్నారు. మొదటి, రెండవ ఏఎన్‌సీలో రక్తహీనతను గుర్తించి సరైన వైద్యం, పౌష్టిక ఆహారం అందిస్తే డెలివరీ సమయానికి రిస్క్ లేకుండా ఉంటుందన్నారు. రక్తహీనతతో హై రిస్క్ అయ్యి సి సెక్షన్ కు వెళ్లే గర్భిణుల విషయంలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లను బాధ్యులను చేయాలని ఆదేశించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం బీపీ, షుగర్ పేషంట్లకు ఉచితంగా మందులు ఇవ్వాన్నారు. ఈ ఔషది, ఈ సంజీవిని, టెలిమెడిసిన్‌పై సమీక్షిస్తూ సబ్‌సెంటర్ల నుంచి పీహెచ్‌సీకి, పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీకి లాగిన్ అయి ఉండాలన్నారు.
పాలియేటివ్ సెంటర్‌లో .. మెరుగైన సేవలు అందించాలి
పాలియేటివ్ కేర్ సెంటర్‌లో మెరుగైన సేవలు అందించాలని శ్వేతా మహంతి డాక్టర్లను ఆదేశించారు. అచ్చంపేట నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లిన ఆమె కలెక్టర్ ఉదయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరితో కలిసి జిల్లా జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. ఎన్‌సీడీ సెంటర్లో రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం పాలియేటివ్ కేర్ కేంద్రానికి వెళ్లారు. సెంటర్‌కు వస్తున్న పేషెంట్ల గురించి వైద్యాధికారి డా. శ్రీవాణిని ఆరా తీయగా... ఆరు నెలల్లో 211 మంది ఔట్ పేషెంట్లు, 61 మంది ఇన్ పేషంట్లు వైద్యం చేయించుకున్నట్లు వివరించారు. సెంటర్‌ను ఫిజియోథెరపిస్ట్ లేదని చెప్పడంతో వెంటనే నియమించాలని ఆదేశించారు. తర్వాత ఈసీజీ మిషన్ పరిశీలించి రోజూ ఎంత మందికి ఈసీజీ తీస్తున్నారని అడిగారు. వైద్యం పొందుతున్న పేషెంట్లకు, తీస్తున్న ఈజీసీలకు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఐసీయూ కేంద్రంతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్ టీ హబ్ కేంద్రాన్ని టెంపరరీగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ పద్మజ, డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్, ప్రభుత్వ జర్నల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు, ఆర్డీవో పాండు నాయక్, వైద్య అధికారులు సురేశ్ బాబు, వెంకటదాస్, రమేశ్ చంద్ర, డాక్టర్లు రమేశ్ చంద్ర, రోహిత్ ఉన్నారు.
డయాగ్నస్టిక్ సెంటర్ 24 గంటలు పనిచేయాలె
టీ డయాగ్నస్టిక్ సెంటర్ 24 గంటలు పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేశారు. టెస్టులు నిర్వహించే యంత్ర పరికరాలను పరిశీలించి.. ఇప్పటి వరకు ఎన్ని టెస్టులు చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డీఎంహెచ్‌వో కృష్ణతో సెంటర్ పనితీరుపై సమీక్షించారు. టైం ప్రకారం వివిధ రకాల టెస్టుల ఫలితాలను రావాలని, ఇందుకు అనుగుణంగా టెస్టుల నిర్వహణ ప్రక్రియను స్పీడప్ చేయాలన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల ద్వారా శాంపిల్స్ సేకరణ, డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపడం లాంటి బాధ్యతలు డీఎంహెచ్‌వో తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రమేశ్, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ శశికాంత్, డాక్టర్లు జీవన్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.