- శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేశ్ నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం/ పాల్వంచ, వెలుగు: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ గెలవాలని ఆకాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ రాజశ్యామలాంబ యాగాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పది రోజులపాటు ఈ యాగం జరిగింది. ఈ నెల 20వ తేదీన హెచ్ కన్వెన్షన్ ప్రాంగణంలో 50 మంది వేద పండితులు, రుత్వికుల నేతృత్వంలో ప్రారంభమైన యాగం.. బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.
పూర్ణాహుతి పూజలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, పీసీసీ సభ్యుడు నాగా సీతారాములు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు,టీఆర్వీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల రమేశ్, ఓసీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సందుపట్ల శ్రీనివాసరెడ్డి, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యాగం ముగింపును పురస్కరించుకొని 5వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.