యాదాద్రి, వెలుగు: మహాలక్ష్మి స్కీం కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ స్టేట్ లీడర్ పీవీ శ్యాంసుందర్రావు కోరారు. ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలోని ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ గోడును వెల్లబోసుకున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కారణంగా రోజుకు రూ. 700 నష్టపోతున్నామని వాపోయారు. ఆటో ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం శ్యాంసుందర్రావు మాట్లాడుతూ... ఫ్రీ బస్సు జర్నీ అమలవుతున్నప్పటి నుంచి రాష్ట్రంలో 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆనేకమంది ఆటోలను ఫైనాన్సియర్లు లాక్కెళ్లారని మండిప్డడారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల యూనియన్లతో మీటింగ్ నిర్వహించి.. ప్రతినెలా రూ. 10 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ, పార్టీ లీడర్లు పోతంశెట్టి రవీందర్, నర్ల నర్సింగ్ రావు, మహేందర్ గుప్తా, అశోక్, నరసింహ చారి, కొండం ఉపేందర్, ఉడుత భాస్కర్, కపిల్, శ్రీశైలం, మహమూద్, వల్లంశెట్టి నగేశ్ ఉన్నారు.