40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ

లంచం.. లంచం.. లంచం.. పుట్టిన పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేయాలన్నా లంచం. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్ మంజూరు చేయాలన్నా లంచం. రోజులు మారినా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పదే పదే ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నా తమ వైఖరిని మార్చుకోవడం లేదు. వచ్చే జీతం చాలదన్నట్లు, ప్రజల రక్తాన్ని పీలుస్తూ రాబోవు తరతరాలకు ఆస్తులు పోగేస్తున్నారు. తీరా పాపం పండిన రోజు ఏసీబీకి చిక్కి నలుగురిలో నవ్వులు పాలవుతున్నారు.

శుక్రవారం(ఆగస్టు 02) మరో లంచగొండి పోలీస్ ఉద్యోగి ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డాడు. ఒక కేసులో ముగ్గురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు 40 వేలు లంచం తీసుకుంటూ వరంగల్ కమీషనరేట్ పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ(ఎస్ఎచ్ఒ)- జి. వెంకన్న ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతను తన డ్రైవర్ పి. సదానందం (ఏఆర్ కానిస్టేబుల్) ద్వారా నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగాఅనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.