- భద్రాచలం టౌన్ పీఎస్‌లో ఏసీబీ దాడులు
- పాల్వంచలో దొరికిన మున్సిపల్ సిబ్బంది
భద్రాచలం, వెలుగు : స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేందుకు లంచం తీసుకున్న భద్రాచలం టౌన్ ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు, సీసీ కెమెరా టెక్నీషియన్‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలంలోని మనోజ్ అనే వ్యక్తికి చెందిన కిరాణ షాపులో ఈ నెల 12న నాలుగు చక్కెర బస్తాలు చోరీ అయ్యాయి.
షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రాచలం టౌన్ ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్‌తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ షాపులో పనిచేస్తున్న మర్రి సాయితేజనే తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో సాయితేజతో పాటు అతడి ఫ్రెండ్స్ సెల్‌ఫోన్లను, బస్తాలను తరలించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తర్వాత షాపు యజమాని, సాయితేజ కాంప్రమైజ్ కావడంతో చక్కెరకు సంబంధించిన డబ్బులను చెల్లించారు. ఆటో, సెల్‌ఫోన్లను తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరడంతో రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సాయితేజ ఖమ్మంలోని ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు శ్యాంసుందర్, మహేశ్, రాజు సూచన మేరకు సాయితేజ, అతడి ఫ్రెండ్స్ కలిసి గురువారం టౌన్ పీఎస్‌కు వచ్చి కానిస్టేబుల్ శంకర్‌కు రూ.20 వేలు ఇచ్చారు. అతడు ఎస్సైకి ఫోన్ చేసి విషయం చెప్పగా, సాయంత్రం మరో రూ. 5 వేలు ఇచ్చేలా ఒప్పించి ఆటో తాళాలు, సెల్‌ఫోన్లు ఇచ్చేశాడు. ఇదే టైంలో ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. అతడితో పాటు టౌన్ ఎస్సై శ్రీనివాసరావు, వారికి సహకరించిన సీసీ కెమెరా టెక్నీషియన్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు.
పాల్వంచ మునిసిపల్ సిబ్బంది..
పాల్వంచ, వెలుగు : ఎల్‌ఆర్‌ఎస్ కోసం లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి చెందిన రియల్టర్, పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్ తన ఫ్లాట్ ఎల్‌ఆర్‌ఎస్ కోసం టౌన్ ప్లానింగ్ విభాగంలో అప్లై చేశారు. రెగ్యులరైజ్ చేయాలంటే రూ. 30 వేలు ఇవ్వాలని సూపర్‌వైజర్ వెంకటరమణి డిమాండ్ చేశారు. దీంతో రూ. 15 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన కనకేశ్ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం మన్సిపల్ ఆఫీస్‌లో డబ్బులు ఇస్తుండగా వెంకటరమణితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను ఏసీబీ డీఎస్పీ రమేశ్ పట్టుకున్నారు. ఇప్పటివరకు వెంకటరమణి చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌లపైనా విచారణ చేస్తున్నారు.