సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకొని వాజేడు SI హరీష్ ఆత్మహత్య

ములుగు: ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన భారీ ఎన్ కౌంటర్‎తో దద్దరిల్లిన ములుగు జిల్లాలో ఇవాళ (డిసెంబర్ 2) విషాద ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకొని ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఏటూరు నాగారం మండల పరిధి ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‎లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేక పని ఒత్తిడి‎తో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు  చేపట్టారు. ములుగు జిల్లా వాజేడులో ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్‎లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్ కౌంటర్ జరిగిన గంటల వ్యవధిలోనే ఎస్ఐ అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.