శంషాబాద్, వెలుగు : పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ పోలీసు సేవా పతకానికి ఎంపికైన ఎస్సై గుండెపోటుతో మృతిచెందగా.. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు, పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి పరిధి ఊట్ పల్లికి చెందిన మార్కాపురం కుమార్ గౌడ్(60), రాజేంద్రనగర్ జోన్ పరిధి మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో సీసీఎస్ (క్రైమ్) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
1987లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ఆయన ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల సీసీఎస్ విభాగానికి బదిలీ అయ్యారు. కుమార్ గౌడ్ నాలుగు రోజుల కిందట అనారోగ్యానికి గురవగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూసినట్లు మృతుడి సోదరుడు చంద్రకుమార్ గౌడ్ సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరో రెండు రోజుల్లో..
ఉత్తమ పోలీసు సేవా పతకానికి ఎంపికైన ఎస్సై కుమార్ గౌడ్ పంద్రాగస్టు వేడుకల్లో అందుకోవాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో పతకం అందుకోవాల్సిన కుమార్ గౌడ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం బాధాకరమని పోలీసు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ , పలువురు పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. ఆదివారం తొండుపల్లిలోని స్మశాన వాటికలో ఎస్సై కుమార్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.