అవినీతి ఆరోపణలు, సిబ్బందితో గొడవతోనే..ఎస్సై ఆత్మహత్యాయత్నం

అవినీతి ఆరోపణలు, సిబ్బందితో గొడవతోనే..ఎస్సై ఆత్మహత్యాయత్నం

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఆదివారం స్టేషన్ ​నుంచి సొంత కారులో డ్రైవర్ ​లేకుండానే ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ సర్వీస్ ​రివాల్వర్​ను పెట్టి బయటకు వెళ్లాడు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంటకు వెళ్లి తన రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్ ​చేశాడు. సీఐ జితేందర్​రెడ్డి ఎస్సైని కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ ​వచ్చింది. దీంతో ఎస్పీ రోహిత్ ​రాజుకు సమాచారం ఇచ్చారు.  ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ఆయన వెతికించగా పాల్వంచలోని దమ్మపేట సెంటర్​లోని సీసీ కెమెరాల కు ఎస్సై కారు చిక్కింది. మహబూబాబాద్​ వైపు వెళ్లినట్టు తెలియడంతో అటుగా బయలుదేరారు. ఈ క్రమంలోనే 11: 30 గంటల ప్రాంతంలో ఎస్సై తన ఫోన్​ఆన్ ​చేసి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగానని 108 సిబ్బందికి ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లిన అంబులెన్స్ ​సిబ్బంది హాస్పిటల్​లో జాయిన్​చేయించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, తర్వాత హైదరాబాద్ యశోదకు తరలించారు.  

ఏం జరిగిందంటే.. 

ఎస్సై ఆత్మహత్యాయత్నానికి కారణం ఏమిటన్న దానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అవినీతిలో కూరుకుపోయిన ఎస్సై కేసుల విషయంలో డబ్బులు తీసుకుంటూ సిబ్బందికి పంచకపోవడం, వారు సహాయ నిరాకరణ చేయడంతో మనస్తాపానికి గురై సూసైడ్​ అటెంప్ట్​ చేసినట్టు తెలుస్తోంది. ఐదు నెలల క్రితం కొత్తగూడెం నుంచి అశ్వారావుపేటకు బదిలీపై వచ్చిన శ్రీనివాస్​ అప్పటి నుంచే అవినీతిలో కూరుకుపోయాడన్న ఆరోపణలున్నాయి. కోడిపందాలు, ఇసుక, మట్టి మాఫియా, పేకాట స్థావరాలపై దాడులపై దృష్టి పెట్టి అందినకాడికి దండుకున్నాడన్న విమర్శలున్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాలను వదిలిపెట్టడానికి కూడా డబ్బులు తీసుకునేవాడని తెలుస్తోంది. అయితే, స్టేషన్​లోని నలుగురు సిబ్బంది తాము కూడా పై కేసుల్లో పని చేస్తున్నా ఎస్సై ఒక్క పైసా ఇవ్వడం లేదని కినుక వహించినట్టు తెలుస్తోంది. తాము ఎందుకు అర్ధరాత్రి వరకు పోలీస్​స్టేషన్​లో పని చేయాలని, అందరితో పాటు తమకూ షిఫ్టులు వేయాలని ఎస్సైని కోరినట్టు సమాచారం. ఆయన ఒప్పుకోకపోవడంతో సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. ఎస్సై అవినీతిపై ఎస్పీకి కంప్లయింట్​ కూడా చేశారు. ఇది ఎస్సైకి తెలియడంతో సదరు సిబ్బందిపై ఎస్పీకి తనకు అనుకూలంగా ఉన్న ఓ కానిస్టేబుల్​తో ఫిర్యాదు చేయించాడని అంటున్నారు. 

అప్పటి నుంచి స్టేషన్​లో ఇంటర్నల్ ​వార్ ​మొదలైంది. స్టేషన్​లో  ఏ సెటిల్​మెంట్​ జరిగినా సిబ్బంది ఇంటెలిజెన్స్​కు సమాచారం ఇచ్చేవారు. ఉన్నతాధికారులకు విషయం చేరి ఐదు నెలల్లో ఎస్సైకి నాలుగు మెమోలు ఇచ్చారు. ఈ మధ్య జరిగిన క్రైం మీటింగ్​లో ఎస్పీ ఈ విషయాలపై ఎస్సైని మందలించినట్టు సమాచారం. సిబ్బందికి కూడా బయటి డ్యూటీలు వేయడంతో పేపర్​వర్క్​ చేసుకోవడం ఎస్సైకి ఇబ్బందిగా మారింది. ఆదివారం ఉదయం ఓ హెడ్​ కానిస్టేబుల్​ఎస్సై అవినీతి గురించి బయట మాట్లాడాడని ఎస్సై చెవినపడింది. దీంతో అతడిని పిలిపించిన ఎస్సై స్టేషన్​లో తలుపు వేసి గంటన్నర మాట్లాడినట్టు సమాచారం. తర్వాతే బయటకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి ఓ ఉన్నతాధికారి, ఇద్దరు రైటర్స్, మరో ఇద్దరు కానిస్టేబుల్సే కారణమని ఎస్సై సన్నిహితులకు చెప్పినట్టు తెలిసింది. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ట్రీట్మెంట్ పొందుతున్న ఎస్సై ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జూపల్లి రమేశ్ ​పరామర్శించారు.