హైదరాబాద్ బోయిన్పల్లిలోని పెంట్​హౌజ్లో ఈ పనులేంటి..?

హైదరాబాద్ బోయిన్పల్లిలోని పెంట్​హౌజ్లో ఈ పనులేంటి..?
  • నకిలీ నోట్ల తయారీ దందా గుట్టురట్టు
  • హైదరాబాద్ బోయిన్పల్లిలోని పెంట్​ హౌజ్లో కరెన్సీ తయారీ
  • ఆరుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
  • రూ.56.90 లక్షల నకిలీ నోట్లు సీజ్, కంప్యూటర్, ఇతర పరికరాలు స్వాధీనం

కామారెడ్డి, వెలుగు: వ్యాపారాల్లో ఏర్పడిన ఆర్థిక నష్టాల నుంచి బయటపడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో  నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాలో 8 మంది ఉండగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేయగా, మరో  ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.56.90 లక్షల(రూ.500 నోట్లు) నకిలీ కరెన్సీ,  పరికరలను స్వాధీనం చేసుకున్నారు.

శనివారం కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీస్​లో ఎస్పీ సింధూశర్మ మీడియాకు  వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ​పోలీసులు కొయ్యగుట్ట వద్ద శుక్రవారం వెహికల్స్​ చెకింగ్​ చేస్తుండగా, కారులో వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని కారును తనిఖీ చేయగా రూ.30 లక్షల నకిలీ నోట్ల కట్టలు దొరికాయి. 

కడపత్రి రాజ్​గోపాల్​రావు, కొలావర్​ కిరణ్​కుమార్,  రమేశ్​గౌడ్​ను పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. కడవత్రి రాజ్​గోపాల్​రావు(తెలంగాణ),  హుస్సేన్​ పీరా( కర్నాటక) నకిలీ రూ. రూ.500 నోట్ల తయారీకి పెట్టుబడులు పెట్టారు.  వీరికి పరిచయం ఉన్న కమలేశ్(రాజస్థాన్), రాధాకృష్ణ అలియాస్​ భరద్వాజ్(ఉత్తరాఖండ్) నోట్లను తయారీ చేస్తారు.  కామారెడ్డి జిల్లాకు చెందిన కొలావార్​ కిరణ్​కుమార్, రమేశ్​గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్,​ఈశ్వర్​ మార్కెట్ లో వీటిని చలామణి చేస్తారు. నకిలీ నోట్ల తయారీ కోసం కంప్యూటర్, పేపర్​ కట్టర్, కలర్​ ప్రింటర్, ఇంక్​ బాటిల్స్, రిబ్బన్స్​ కొనుగోలు చేశారు. హైదరబాద్​ బోయిన్​పల్లిలోని అంటిలియా అపార్ట్​మెంట్​ పెంట్​ హౌజ్​ను కిరాయికి తీసుకున్నారు. అక్కడ రూ.60 లక్షల నకిలీ నోట్లను తయారు చేశారు. వీటిలో నుంచి రూ.3 లక్షలను కిరణ్​కుమార్(బిచ్కుంద), రమేశ్​గౌడ్( బాన్సువాడ)కు ఇచ్చారు. ఈ కరెన్సీని వీళ్లు చుట్టు పక్కల గ్రామాల్లో చలామణి చేశారు.

హైదరాబాద్​ నుంచి  రాజ్​గోపాల్​రావు రూ.30 లక్షలు తీసుకొని వారికి ఇచ్చేందుకు శుక్రవారం రాగా, పోలీసులకు దొరికారు. వారు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్​లో తనిఖీలు నిర్వహించి.. రూ.26.90 లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రితో పాటు హుస్సేన్​ పీరా, భరద్వాజ్, అజయ్​ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్​కు చెందిన కమలేశ్, సుక్రాయ్​పరారీలో ఉన్నారు. నకిలీ కరెన్సీ, నోట్ల తయారు కోసం వాడిన సామగ్రి,   కారు, 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే రాజ్​గోపాల్​రావు  కొంత కాలం ఆమెరికాలో పని చేశాడు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్​ ఇన్స్​పెక్టర్​ శ్రీనివాస్, బాన్సువాడ టౌన్​ సీఐ అశోక్, సీసీఎస్, పిట్లం ఎస్సైలు  ఉస్మాన్​, రాజు,  సీసీఎస్​ ఏఎస్సై రాజేశ్వర్, సిబ్బంది కిషన్, గణపతి, రాజేందర్, శ్రావణ్​ను ఎస్పీ అభినందించారు.

వ్యాపారం కలిసి రాక..
రియల్​ ఎస్టేట్,  కన్​స్ట్రక్షన్, ఇతర వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నకిలీ నోట్ల తయారీని ఎంచుకున్నారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్​లోని కొంపల్లికి చెందిన రాజ్​గోపాల్​రావు గతంలో ఆమెరికాలో ఉండి ఆర్థికంగా ఎదిగాడు. ఇక్కడకు వచ్చి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. వీటిలో నష్టాలు రావడంతో బోయిన్​పల్లిలోని ఉన్న బిల్డింగ్​ను అమ్మేశాడు. కర్నాటక రాయచూర్​కు చెందిన కనస్ట్రక్షన్​ బిజినెస్​ చేసే హుస్సేన్​ పీరాతో పరిచయం ఏర్పడింది.

రాజ్​గోపాల్​రావు కు చెందిన  స్థలంలో గుప్త నిధులు ఉన్నాయని పీరా చెప్పాడు. అక్కడ తవ్వినా ఫలితం లేదు. ఆ తరువాత తమకు పరిచయం ఉన్న  రాజస్థాన్, ఉత్తరఖాండ్​కు చెందిన వ్యక్తులతో కలిసి నకిలీ నోట్ల తయారీ దందాను షూరు చేశారు. అంతకుముందు రాజ్​గోపాల్​రావు బోయిన్​పల్లిలో అమ్మిన  బిల్డింగ్​లోనే  పెంట్​హౌజ్​ను కిరాయికి తీసుకొని నకిలీ నోట్లను తయారు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.